మంత్రి కొప్పులకు నిరసన సెగ

పెగడపల్లి, వెలుగు :  జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు నిరసన సెగ తగిలింది. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మంగళవారం గ్రామానికి వచ్చిన మంత్రికి వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి గ్రామస్తులు నిరసన తెలిపారు. మంత్రి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నామాపూర్ గ్రామంలో కాళేశ్వరం లింక్-2 ద్వారా రైతులు భూములు కోల్పోగా.. మంత్రి ఈశ్వర్ మొదటి విడత కోల్పోయిన వారికి రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల అవార్డు ప్రకటించి నష్టపరిహారం అందజేశారని, సెకండ్ విడత భూసేకరణలో భూమి కోల్పోయిన వారికి రూ.13 లక్షలు ప్రకటించారన్నారు. 

అదే కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో కాళేశ్వరం లింక్ 2లో భూమి కోల్పోయిన రైతులకు రూ.21 లక్షల నుంచి రూ.25 లక్షలు నష్టపరిహారం అందించారన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రామడుగు మండలంలో ఒక రేటు, పెగడపల్లి మండలం నామాపూర్ లో వేరే రేటు ఎలా ఉంటుందని వారు ప్రశ్నించారు. 

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఎకరాకు రూ.30 లక్షలు ధర పలుకుతోందని ప్రజా ఆశీర్వాదయాత్రలో చెబుతున్నారని, లింకు 2లో భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం రూ.30 లక్షలు  ఎక్కడ ఇచ్చారో చెప్పాలని గ్రామస్తులు నిలదీశారు. కాళేశ్వరం లింక్-2 ద్వారా ఎవరికి ప్రయోజనం లేదని, ఈ ప్రాంత ప్రజలకు చుక్క నీరు రాదనిపేర్కొన్నారు. కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఈశ్వర్ లింకు 2 ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు.