ఎమ్మెల్యే విఠల్​ రెడ్డికి నిరసన సెగ

ఎమ్మెల్యే విఠల్​ రెడ్డికి నిరసన సెగ

కుంటాల, వెలుగు:  నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో పోడు పట్టాల పంపిణీకి వచ్చిన ముధోల్​ ఎమ్మెల్యే విఠల్​ రెడ్డికి నిరసన సెగ తగిలింది. శుక్రవారం రైతు వేదికలో  పోడు రైతులకు  అటవీ హక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమం రసాభాసగా మారింది. 580 మంది దరఖాస్తు చేసుకుంటే 105 మందికి పట్టాలు ఇవ్వడం ఏంటని ఎమ్మెల్యేను గిరిజనులు  ప్రశ్నించారు. అంబుగామ్, కుంటాల, అంబకంటి తండాతో పాటు ఆయా గ్రామాల పోడు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము పూర్వం నుంచి అటవీ భూములను సాగు చేస్తున్నామని, అనర్హులకు, వలస వచ్చిన వారికి పట్టాలు ఇవ్వడమేంటని గిరిజనులు, ఆదివాసీలు నిలదీశారు. 

నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన వారికి పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది.