ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ మెస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలుత ఎన్ఎస్ పీ ఓల్డ్ క్యాంపులో ఉన్న ఎస్సీ హాస్టల్ స్టూడెంట్స్ తో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు, కస్తూర్బా, ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన మెస్ చార్జీలు రూ.కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
దీంతో వసతి గృహ సంక్షేమ అధికారులు అప్పులు తెచ్చి నడుపుతున్నారని తెలిపారు. ఆర్థిక భారంతో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించలేకపోతున్నారని చెప్పారు. ఒక్కో విద్యార్థికి మూడు పూటలా భోజనానికి రాష్ట్రప్రభుత్వం రూ.33 మాత్రమే ఖర్చు పెడుతోందన్నారు. కాస్మోటిక్ చార్జీలు కూడా విద్యార్థికి నెలకు రూ.62 మాత్రమే అందిస్తోందని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని పెండింగ్ లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు కరుణ్, సందీప్, ప్రసాద్, శ్రీను పాల్గొన్నారు.