పాత అలైన్​మెంట్​ ప్రకారమే హైవే నిర్మించాలి .. మిట్టపల్లిలో బాధితులు ఆందోళన

పాత అలైన్​మెంట్​ ప్రకారమే హైవే నిర్మించాలి .. మిట్టపల్లిలో బాధితులు ఆందోళన

సిద్దిపేట రూరల్, వెలుగు: పాత అలైన్​మెంట్ ప్రకారమే నేషనల్​హైవే 765 డీజీ(మెదక్–సిద్దిపేట–ఎల్కతుర్తి)ని నిర్మించాలని సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామంలోని రైతు వేదిక వద్ద రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సంతోశ్, స్థానిక లీడర్​కనక మల్లయ్య మాట్లాడుతూ.. పాత అలైన్​మెంట్​ప్రకారం100 అడుగుల మేర మార్క్ చేసిన అధికారులు.. ఇప్పుడు 150 అడుగుల వెడల్పుతో రోడ్డు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. హైవే వెడల్పు పెంచి నిర్మిస్తే పాత అలైన్​మెంట్ ప్రకారం ఇండ్లు నిర్మించుకున్నవారు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.

దాదాపు 35 నుంచి 40 ఇండ్లు వైడనింగ్ కింద డ్యామేజ్​అవుతాయన్నారు. కొందరు ఖాళీ ప్లాట్లు నష్టపోవాల్సి ఉంటుందని వాపోయారు. అధికారులు స్పందించి గతంలో మార్కింగ్ చేసిన ప్రకారం 100 అడుగల వెడల్పుతో హైవేను నిర్మించాలని, అలాగే బ్రిడ్జిని 600 మీటర్ల నుంచి 300 మీటర్లకు కుదించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములు ఇచ్చామని, పరిహారం కింద వచ్చిన డబ్బుతో ఇక్కడ ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నామని చెప్పారు. హైవే నిర్మాణంతో ఇండ్లు దెబ్బ తినకుండా చూడాలని కోరారు. లేకుండా తమకు చావే దిక్కన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో బాధితులు గొట్టి కవిత, వెంటలక్ష్మి, సత్తవ్వ, రాజు, హనుమంతు, బుట్టి లింగం, రాజేశం, ప్రశాంత్, సంపత్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.