భద్రాచలం,వెలుగు : తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. జగదీశ్ నగర్, ఎల్బీజీ నగర్, ఆదర్శ నగర్ కాలనీలకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా పంచాయతీ మోటార్లు కాలిపోవడంతో తమ కాలనీలకు తాగునీరు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ నీళ్లు కూడా అరకొరగా వస్తున్నాయని తెలిపారు. పేదలు ఎక్కువగా ఉండే తమ కాలనీలను పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం పంచాయతీ ఈఓకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం టౌన్ సెక్రటరీ గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు సత్య, సౌభాగ్యం, అనంతలక్ష్మి తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.