వైరా, వెలుగు : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ దేశంలోని కాంగ్రెస్ ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే పిలుపునిచ్చారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రాహుల్ ప్రధాని అవుతారన్న భయంతోనే కేంద్ర ప్రభుత్వం ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసిందని విమర్శించారు. వ్యాపారవేత్త అదానీ లక్ష కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి లూటీచేసి వేర్వేరు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, ఈ విషయం దేశ ప్రజలకు తెలుసన్నారు. అదానీ దోపిడీ చేసిన లక్ష కోట్లు ఎక్కడికి వెళ్లాయో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘రాహుల్‌కి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలు గుర్తించి ప్రతిఒక్కరూ ఆయనకు అండగా నిలవాలి. రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా రాహుల్‌కు మద్దతుగా మాట్లాడారు. దేశంలోని బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమై ఆయనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి” అని ఠాక్రే పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో భావితరాలకు భవిష్యత్తు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
రాహుల్‌ను జైలుకు పంపితే ప్రజలే కేంద్రానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుట్టలను జేసీబీలతో అక్రమంగా లాక్కొని, పేదవాళ్ల పొట్ట కొడుతున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే ఇంటికెళ్లి కొడతానని హెచ్చరించారు.