ఆగని రైతుల ఆందోళనలు.. అమ్మిన వడ్లను తిప్పి పంపారని పెద్దపల్లి జిల్లాలో నిరసన  

ఆగని రైతుల ఆందోళనలు
అమ్మిన వడ్లను తిప్పి పంపారని పెద్దపల్లి జిల్లాలో నిరసన  
వడ్లు కొనడం లేదని జగిత్యాల జిల్లాలో రాస్తారోకో

సుల్తానాబాద్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ కొన్ని రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలు ఆగడం లేదు. గురువారం కూడా పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు చేసిన వడ్లకు రైస్ మిల్లర్లు కొర్రీలు పెడుతూ తిప్పి పంపడాన్ని నిరసిస్తూ గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో రైతులు ఆందోళన చేశారు. సుమారు 200 మంది రైతులు ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా పెట్టి రాస్తారోకో చేశారు. న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడిసిన, రంగు మారిన వడ్లను కూడా కొంటామని ప్రభుత్వం చెబుతుండగా ఫీల్డ్​ లెవెల్​లో అది అమలు కావడం లేదన్నారు.

పీఏసీఎస్‌‌‌‌లో కొన్న వడ్లు సుల్తానాబాద్ రైస్ మిల్లులకు పంపించగా రెండు ట్రాక్టర్ల వడ్లను నాణ్యత లేవన్న సాకుతో మిల్లర్లు తిప్పి పంపారన్నారు. రైతుల ఆందోళనతో సుల్తానాబాద్ నుంచి కాల్వ శ్రీరాంపూర్ వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై అశోక్ రెడ్డి రైతుల దగ్గరకు వెళ్లి జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడించారు. దీంతో అన్ని రకాల వడ్లను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు గడ్డం మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ గడ్డం రాజమణి, మాజీ సర్పంచ్ రాజ కొమురయ్య, రాజిరెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, మల్లారెడ్డి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. 

రోడ్డెక్కిన దట్నూర్ రైతులు

గొల్లపల్లి : పాక్స్ అధికారులు వడ్లు కొనడం లేదని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్​లోని  చిల్వకోడూరు చౌరస్తా వద్ద జగిత్యాల–-ధర్మారం రోడ్డుపై గురువారం రైతులు రాస్తారోకో చేశారు.చందోలి పాక్స్ ఆధ్వర్యంలో సబ్ సెంటర్ ఏర్పాటు చేసి వడ్లు కొంటామని దట్నూర్ గ్రామ సమీపంలో భూమి చదును చేయగా రైతులు వడ్లు పోసుకున్నారు. నెలరోజులు గడుస్తున్నా కొనకపోవడం, అడిగితే అప్పుడు ఇప్పుడు అని జరుపుకుంటూ వస్తుండడంతో రైతులు రోడ్డెక్కారు. వెంటనే కొనుగోళ్లు మొదలుపెట్టాలని దాదాపు గంటసేపు రాస్తారోకో చేశారు. అధికారులు వచ్చి కొంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.