ముషీరాబాద్, వెలుగు: ఎన్నికలకు ముందు కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ వెంకట రమణ డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, నిరసనలకు పిలుపునిచ్చారు. సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. వెంకట రమణ మాట్లాడుతూ కాటమయ్య రక్షణ కవచాన్ని పది వేల మంది గీత కార్మికులకే ఇచ్చారని, మిగతా వారికి కూడా ఇవ్వాలని కోరారు.
ప్రమాదం జరిగి ఇంటికి పరిమితమైన గౌడ కులస్తులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెక్లెస్ రోడ్ లోని నీరా కేఫ్‌ను టాడి కార్పొరేషన్ కు అప్పగించి, నందనంలోని నీరా ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ఏరియాలోని సొసైటీలను పునర్ధించి వారికి కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బొలగాని జయరాములు, బి.వెంకట నరసయ్య, పి.అచ్చాలు, వెంకట మల్లయ్య, గౌని వెంకన్న, సీతారాములు, రమేశ్ గౌడ్, బూడిద గోపి, అరుణ్, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.