బీజేపీ రైతు గోస.. కాంగ్రెస్ మోదీ గోస.. లక్సెట్టిపేట టౌన్​లో పోటాపోటీగా నిరసనలు

బీజేపీ రైతు గోస.. కాంగ్రెస్ మోదీ గోస.. లక్సెట్టిపేట టౌన్​లో పోటాపోటీగా నిరసనలు

లక్సెట్టిపేట, వెలుగు: కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా నిరసనలతో మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట టౌన్‎లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. గురువారం బీజేపీ ‘రైతు గోస’.. కాంగ్రెస్ ‘మోడీ గోస’ పేరుతో నిరసనలకు దిగాయి. ముందుగా బీజేపీ నేతలు, కార్యకర్తలు, రైతులు ఉట్కూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నిరసన తెలిపేందుకు ర్యాలీగా బయలుదేరారు.  

పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు సర్ది చెప్పినా వినకపోవడంతో అరెస్టు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే అక్రమ అరెస్టులు సరికాదని మండిపడ్డారు. బీజేపీ లీడర్లు పెద్దపల్లి పురుషోత్తం, గాదె శ్రీనివాస్,కృష్ణమూర్తి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.  

మోదీ పాలనలో రైతులకేం చేసిన్రు..?: కాంగ్రెస్ నేతలు​ 

కేంద్రంలో 11 ఏండ్ల బీజేపీ పాలనలో రైతులకు ఏం చేశారని కాంగ్రెస్ నేతలు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, ఆర్టీపీ ఆర్ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి ప్రశ్నించారు. స్థానిక ఉట్కూర్ చౌరస్తా వద్ద ‘ మోడీ గోస’ పేరుతో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లీడర్లు ఎండీ ఆరీఫ్, పింగళి రమేశ్, చల్ల నాగభూషణం పూర్ణచందర్రావు, ఆకుల రాజేందర్ గడ్డం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.