బంగ్లాదేశ్‌‌‌‌లో కర్ఫ్యూ.. కన్పిస్తే కాల్చివేతే

  • అల్లర్లలో ఇప్పటిదాకా 115 మంది మృతి
  • వెయ్యి మంది స్టూడెంట్లు ఇండియాకు రిటర్న్
  • మరో 15 వేల మంది అక్కడే సేఫ్​గా ఉన్నట్లు వెల్లడి

ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌‌లో స్టూడెంట్లు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో విద్యార్థులకు, పోలీసులకు, అధికార పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలు 47 జిల్లాల్లో హింసాత్మకంగా మారడంతో ఇప్పటిదాకా 115 మంది చనిపోయారు. అల్లర్లు కొనసాగుతుండటం, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.

 దేశవ్యాప్తంగా "షూట్-ఆన్-సైట్-ఆర్డర్(కనిపిస్తే కాల్చివేత)"తో కఠినమైన కర్ఫ్యూ విధించింది. ఆదివారం ఉదయం 10 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. అవసరమైతే పొడిగిస్తామని పేర్కొంది. రోజూ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు సడలింపు ఉంటుందని చెప్పింది. నిబంధనలు అతిక్రమించినవారిపై కాల్పులు జరపడానికి అధికారులను అనుమతించినట్లు స్పష్టంచేసింది.  అలాగే.. అల్లర్లను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం పలు ఏరియాల్లో  సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, ఆన్‌‌లైన్ కమ్యూనికేషన్‌‌లను బ్లాక్ చేసింది.

అది బంగ్లా అంతర్గత విషయం: భారత్

బంగ్లాదేశ్‌‌లో చెలరేగిన హింసపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. దీన్ని బంగ్లాదేశ్‌‌ అంతర్గత విషయంగా తాము పరిగణిస్తున్నట్లు పేర్కొంది. అక్కడున్న భారత పౌరుల భద్రతను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని వెల్లడించింది. ఇప్పటివరకు సుమారు 1000 మంది విద్యార్థులు ఇండియాకు రిటర్న్ వచ్చారని వివరించింది. మొత్తంగా 8 వేల మంది విద్యార్థులతో సహా 15 వేల మంది భారతీయులు బంగ్లాదేశ్‌‌లో సేఫ్ గానే ఉన్నారని చెప్పింది.