మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా కొనసాగిన నిరసనలు

  • గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎక్కి అంబారిపేట్ రైతుల ఆందోళన 
  • తర్వాత ర్యాలీగా కలెక్టరేట్​కు  కలెక్టర్​ లేకపోవడంతో ఏఓకు వినతిపత్రం 
  • ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముందు నర్సింగాపూర్, మోతె గ్రామాల రైతుల ఆందోళన
  • గుంట భూమి కూడా పోనివ్వనంటూ ఎమ్మెల్యే  హామీ

జగిత్యాల, వెలుగు : జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని ఆయా గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం అంబారిపేట్, హస్నాబాద్ గ్రామాల్లో తమ భూములను మాస్టర్​ప్లాన్​నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఆయా గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా అంబారిపేట్ లో పలువురు రైతులు, గ్రామస్తులు గ్రామ పంచాయతీ బిల్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. తర్వాత ఛలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు. దీంతో అంబారీపేట్, హస్నాబాద్ గ్రామాల్లోని బాధితులు ట్రాక్టర్లు, బైక్ లపై జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా కొత్త బస్టాండ్ కు చేరుకుని బైఠాయించారు. కొద్దిసేపటి తర్వాత కలెక్టరేట్ కు చేరుకున్నారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కలెక్టర్ రవిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు డిమాండ్​చేయడంతో ఆయన లేరని, ఒప్పుకుంటే ఐదుగురిని మాత్రమే ​అడ్మినిస్ట్రేషన్​ ఆఫీసర్​(ఏఓ)ను కలవడానికి పర్మిషన్​  ఇస్తామని చెప్పారు. దీంతో ఐదుగురు వెళ్లి ఏఓ చరణ్​కు  వినతిపత్రం ఇచ్చి వచ్చారు. మరో వైపు జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ పంచాయతీలో మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని తీర్మానం చేసి జగిత్యాల మున్సిపల్ ఆఫీస్ లో తీర్మాన పత్రాన్ని అందజేశారు.    

క్యాంప్​ ఆఫీసు ఎదుట మహిళా రైతుల బైఠాయింపు

జగిత్యాల మండలం నర్సింగాపూర్, మోతె గ్రామాలకు చెందిన సుమారు వంద మందికి పైగా మహిళా రైతులు ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్ ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజీవ్​కుమార్​వారి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ గతంలో ఎస్సారెస్పీ, టీఆర్ నగర్ అర్బన్ హౌసింగ్ బోర్డు కాలనీ కోసం భూములు కోల్పోయామని, జోన్ల కేటాయింపుతో తాము రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎమ్మెల్యే బదులిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్టర్ ప్లాన్ ను రూపొందించారని, అందులో భాగంగానే పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో సర్వే నంబర్లను కేటాయించారన్నారు. ఈ విషయమై 2015లోనే మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్​మెంట్..​స్టేట్ గవర్నమెంట్ కు లెటర్​రాసిందని గుర్తు చేశారు. ఇతర నియోజకవర్గాల్లో గ్రామాలకు గ్రామాలు మున్సిపాలిటీల్లో కలిపారని, అయితే తాము ఎక్కడా పూర్తి గ్రామాన్ని విలీనం చేయలేదని, సర్వే నంబర్లు మాత్రమే కలిపామన్నారు. రైతులకు ఇష్టం లేకపోతే ఒక్క గుంట భూమి కూడా పోకుండా చేస్తానన్నారు. దీంతో రైతులు వెనుదిరిగారు.