కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ యత్నం
యాదాద్రి, వెలుగు : బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి జరిగిన ఘటనతో భువనగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా బీఆర్ఎస్, కాంగ్రెస్నాయకులు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించారు. సీఎంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ తో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి చేశారు. ఇందుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి ఆదివారం బీఆర్ఎస్ పూనుకుంది.
దీంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్లును హౌస్ అరెస్ట్ చేశారు. అయితే భువనగిరి, నకిరేకల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావు భువనగిరిలోని వినాయక చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో ప్రిన్స్ చౌరస్తాలో మరికొందరు లీడర్లు రాస్తారోకో నిర్వహించారు.
కాంగ్రెస్ నాయకుల ఆందోళన..
సీఎంపై బీఆర్ఎస్ లీడర్లు చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని దహనం చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.