
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయం దగ్గర హైటెన్షన్ నెలకొంది. జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు, హిందు సంఘాలు గురువారం (ఏప్రిల్ 24) పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్‌లో అల్లర్లకు కుట్ర చేస్తోందంటూ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ, హిందు సంఘాల నేతల ఆందోళన వెనక మరో కారణం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ వ్యక్తి కేక్ పట్టుకుని పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి వెళ్తుండగా.. కేక్ ఎవరు ఆర్డర్ చేశారని సదరు వ్యక్తిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అతడు ఏం సమాధానం చెప్పకుండానే కేక్ పట్టుకుని ఆఫీసులోకి వెళ్లడంతో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోనే పాక్ అధికారులు సెలబ్రేషన్స్ చేసుకున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలోనే బీజేపీ, హిందు సంఘాల నేతలు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు పాక్ హై కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిరసనకారులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా, జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతం బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే.
>కుటుంబంతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశమంతా ఉలిక్కిపడింది. ఈ క్రమంలో పహల్గాంలో రక్తపుటేరులు పారించిన ముష్కరులు కోసం భద్రత దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం అడుగడుగునా నిశితంగా పరిశీలిస్తు్న్నాయి.While India mourns, the Pakistan High Commission is celebrating with cake.pic.twitter.com/C9dljJ1jMB
— Rishi Bagree (@rishibagree) April 24, 2025
ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై భారత ప్రభుత్వం ఒంటి కాలిపై లేస్తోంది. 28 మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసుల వెనక పాక్ హస్తం ఉందని భారత్ ఆరోపించింది. ఈ క్రమంలోనే పాక్ తో పూర్తిగా దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయ అధికారులు వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.