లక్నో: లెబనాన్‌లోని హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సోమవారం నిరసనలు చేపట్టారు. షియా మత గురువు మౌలానా కల్బే జవాద్ పిలుపు మేరకు ఓల్డ్ సిటీలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వందల సంఖ్యలో ప్రజలు హాజరై, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రజలు తమ ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేయాలని, షాప్‌లు మూసివేయాలని కోరారు. నస్రల్లా ఫొటోలు ఉన్న ప్లకార్డులు పట్టుకొని అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. నస్రల్లా అమరుడని కొనియాడుతూ, ఆయన మృతికి జవాద్ సంతాపం తెలిపారు. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అతిపెద్ద టెర్రరిస్ట్ అని నిరూపించిందని, నస్రల్లా మరణం వృథా పోదని, త్వరలోనే ఇజ్రాయెల్ నాశనం అవుతుందన్నారు. నస్రల్లా సాధించిన విజయాలను తాము ఎప్పటికీ మర్చిపోమని, ఆయన ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని చెప్పారు.