
నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఆఫీసర్లు ప్రొటోకాల్ పాటించడం లేదని, ఫ్లెక్సీలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. కేసముద్రం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారాన్ని సోమవారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్, శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
అయితే స్టేజీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫొటో లేదని గమనించిన ఆయన అనుచరులు స్టేజీ కింద బైఠాయించారు. సీనియర్ లీడర్‌ను కావాలనే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫ్లెక్సీలో ఎమ్మెల్యే లేకపోవడంతో తాము ప్రమాణస్వీకారం చేయబోమని, ప్రోగ్రామ్‌ను వాయిదా వేయాలని వైస్ చైర్మన్ రాంపల్లి రవి, కొందరు డైరెక్టర్లు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. చివరికి స్టేజీపైన ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో నిరసన విరమించారు.