జనగామ జడ్పీ మీటింగ్‌‌‌‌లో ప్రొటోకాల్‌‌‌‌ గొడవ

  •     కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ సభ్యుల ఆగ్రహం
  •     రైతుబంధు ఎప్పుడిస్తారని ప్రశ్నించిన జడ్పీటీసీలు
  •     ఎమ్మెల్యేతో జడ్పీటీసీ సభ్యుల వాగ్వాదం

జనగామ, వెలుగు : ‘సీసీ రోడ్ల ప్రారంభం, ఇతర కార్యక్రమాలకు కనీస సమాచారం ఇస్తలేరు.. ప్రజలు ఎన్నుకున్న తమకు కనీస గౌరవం కూడా ఇవ్వరా ? అంటూ జడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల్లో జవాబుదారీతనం లోపించిందని మండిపడ్డారు. జనగామ జడ్పీ చైర్‌‌‌‌పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం జనరల్ బాడీ మీటింగ్‌‌‌‌ జరిగింది. 

సమావేశానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరయ్యారు. అనంతరం పాలకుర్తి, తరిగొప్పుల జడ్పీటీసీలు పుస్కూరి శ్రీనివాసరావు, ముద్దసాని పద్మజారెడ్డి, జనగామ, పాలకుర్తి ఎంపీపీలు మేకల కలింగ రాజు, నాగిరెడ్డి మాట్లాడుతూ రైతు బంధు డబ్బులు ఎప్పుడు డిపాజిట్‌‌‌‌ చేస్తారని ప్రశ్నించారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్‌‌‌‌ వినోద్‌‌‌‌కుమార్ వివరాలు చెప్పే ప్రయత్నం చేసినా సభ్యులు పట్టించుకోకుండా ఎప్పటివరకు వేస్తారో స్పష్టంగా చెప్పాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు లక్ష మంది రైతులకు రైతుబంధు వేశామని చెప్పారు. 

గతంలో వందల ఎకరాలు ఉన్న వారికి కూడా రైతుబంధు ఇచ్చారని, ఇప్పుడు అలా కాకుండా అర్హులైన వారికే అందించనున్నట్లు తెలిపారు. దీంతో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ జడ్పీటీసీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ‘జడ్పీటీసీలు మాట్లాడినప్పుడు నేను సైలెంట్‌‌‌‌గా ఉన్నా, నేను మాట్లాడినప్పుడు మీరు వినాలి’ అని ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోలేదు. అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ప్రొటోకాల్‌‌‌‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు.

సభ్యుల మధ్య వాగ్వాదం

ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతున్న టైంలో పాలకుర్తి జడ్పీటీసీ శ్రీనివాసరావు కల్పించుకుని మీకు అవగాహన ఉందా ? అంటూ అడ్డు తగిలారు. దీంతో అసహనానికి గురైన యశస్వినిరెడ్డి తన ప్రసంగానికి అడ్డు తగలవద్దని హెచ్చరించారు. అనంతరం ముందస్తు షెడ్యూల్‌‌‌‌ ఉన్నందున ఆమె మీటింగ్‌‌‌‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో దేవరుప్పుల జడ్పీటీసీ భార్గవి, పాలకుర్తి జడ్పీటీసీ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాము తప్పు మాట్లాడితే మీటింగ్‌‌‌‌లోనే ఉండి అడగాలి కానీ మధ్యలోనే వెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నించారు. రఘునాథపల్లి ఎంపీపీ మేకల వరలక్ష్మి కల్పించుకుని ఎమ్మెల్యేను అగౌరవపరిచేలా మాట్లాడడం, అవగాహన ఉందా అంటూ ప్రసంగానికి అడ్డు తగలడం సరికాదన్నారు. దీంతో తాము అలా అనలేదని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సభ్యులు వాగ్వాదానికి దిగారు. 

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లు

మీటింగ్‌‌‌‌లో నర్మెట జడ్పీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ తన మండలానికి అంబులెన్స్‌‌‌‌ సౌకర్యం కల్పించాలని కోరారు. పాలకుర్తి హాస్పిటల్‌‌‌‌లో పోస్ట్‌‌‌‌మార్టం జరిగేలా చర్యలు చేపట్టాలని స్థానిక జడ్పీటీసీ డీఎంహెచ్‌‌‌‌వోను కోరారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల టైంలో తమను పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రొటోకాల్​ప్రకారం నడుచుకోవాలని డిమాండ్ చేశారు. మీటింగ్‌‌‌‌కు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కూడా వస్తే బాగుండేదన్నారు. జడ్పీ సీఈవో అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌ బిజీ షెడ్యూల్ కారణంగా కలెక్టర్ రాలేదని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.