- ఎమ్మెల్యే వనమా శంకుస్థాపనలకు మంత్రి పువ్వాడ బ్రేక్
- నామాతో కౌన్సిలర్లు ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకున్న వనమా టీం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుల మధ్య ప్రోటోకాల్ చిచ్చు రేగింది. దీంతో వివిధ అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. శిలాఫలకాల్లో మంత్రి పేరు చిన్నగా, మూడో వ్యక్తిగా ఉండడంతో శిలాఫలకాలను మార్చాలంటూ జిల్లా ఆఫీసర్లకు పువ్వాడ హుకుం జారీ చేశారు. మరోవైపు కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లను ఎంపీ నామా ఢిల్లీ తీసుకెళ్లేందుకు షెడ్యూల్ రూపొందించగా టూర్‌ను ఎమ్మెల్యే వర్గం క్యాన్సల్ చేయించింది. దీంతో ఎమ్మెల్యే తీరుపై కౌన్సిలర్లు మండిపడుతున్నారు.
రూ. 250కోట్లకు పైగా పనులకు బ్రేక్..
కొత్తగూడెంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్లకు పైగా పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సిద్ధపడ్డారు. ఈ నెల 16న కొత్తగూడెం క్లబ్లో జిల్లా అధికారులు, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు చెందిన అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రాబోతున్న క్రమంలో డెవలప్మెంట్వర్క్స్ స్పీడ్‌గా చేపట్టాలన్నారు. 17న ఉదయం 9.30 గంటలకు కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి శంకుస్థాపనలుంటాయని స్పష్టం చేశారు.
ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు శంకుస్థాపనలు చేస్తానని, అందుకు సంబంధించి ఏర్పాట్లు, శిలాఫలకాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అయితే కొత్తగూడెం మున్సిపాలిటీలో శిలాఫలకాల్లో ఎమ్మెల్యే పేరు పెద్ద అక్షరాలతో ఉండగా, దాని కింద మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ పేర్లు చిన్న అక్షరాలతో రాయడాన్ని పలువురు పువ్వాడ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు ఆఫీసర్ల తీరుపై మంత్రిఅసహనం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.
తలొనొప్పిగా ఢిల్లీ టూర్
మరో వైపు ఈ నెల 23న కొత్తగూడెం మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లను ఢిల్లీ టూర్ తీసుకెళ్లేందుకు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్లాన్ చేశారు. అన్నీ అనుకున్న తర్వాత ఇప్పుడు శంకుస్థాపనలు చేసే టైంలో మీరు వెళ్తే ఎట్లా అంటూ టూర్‌కు వెళ్లకుండా ఎమ్మెల్యే వర్గం అడ్డుపడింది. ఎమ్మెల్యే తీరుపై అటు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఎంపీ నామా కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు టికెట్ కన్ ఫర్మ్ అయిన టైంలో శిలాఫలకాలతో పాటు ఢిల్లీ టూర్ తలనొప్పిగా మారింది.
శంకు స్థాపనలు ఆపాలి
శిలాఫలకాల్లో మార్పు చేసేంత వరకు శంకుస్థాపనలు ఆపాలని మంత్రి పేషీ నుంచి ఆఫీసర్లకు ఈ నెల 16న ఆదేశాలొచ్చినట్టుగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. దీంతో ఆఫీసర్లు అప్పటికే తయారు చేసిన శిలాఫలకాలను మార్చే పనిలో పడ్డారు. మరో వైపు కొన్ని శంకుస్థాపనలకు తానే వస్తానని, అప్పటివరకు ఆపాలంటూ మంత్రి ఆదేశించినట్టుగా మున్సిపాలిటీలో గుసగుసలు వినపడుతున్నాయి.