సిద్దిపేటలో ప్రొటోకాల్ రగడ

సిద్దిపేటలో ప్రొటోకాల్ రగడ
  • ఫ్లెక్సీలో ఎంపీ రఘునందన్​రావు ఫొటో పెట్టలేదని నిరసన

 సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద పూలే విగ్రహానికి శుక్రవారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విపంచి ఆడిటోరియంలో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రొటోకాల్​వివాదం నెలకొంది. అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో ఎంపీ రఘునందన్ రావు ఫొటో లేకపోడంతో బీజేపీ నేత కొత్తపల్లి వేణుగోపాల్ తో పాటు మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల ఫొటోలు ఫ్లెక్సీలో పెట్టి స్థానిక ఎంపీ ఫోటో ను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వేణుగోపాల్ తో పాటు బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేసి కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోయారు.