- సీసీ రోడ్లకు భూమిపూజ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు
- అధికారిక పనుల్లో పాల్గొనడం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం
- జోరుగా ప్రారంభిస్తున్న ఎన్ఆర్ఈజీఎస్ రోడ్ల పనులు
- జిల్లా వ్యాప్తంగా రూ.30.76 కోట్లతో సీసీ రోడ్లు
ఆదిలాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలో గత కొన్ని రోజులుగా చేపడుతున్న సీసీ రోడ్ల పనుల్లో ప్రోటోకాల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో సీసీ రోడ్ల పనులకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు భూమి పూజ చేస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేల కోటా కింద వచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రామల్లో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు.
అయితే పనులను ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీల నేతలు సైతం ప్రారంభించడం పట్ల ప్రొటోకాల్ సమస్య తలెత్తుతోంది. జిల్లా ఇన్చార్జిగా ఉన్న మంత్రి సీతక్క ప్రతిపాదనలతో మంజూరైన పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభిస్తున్నారు. అధికారిక పనులను కాంగ్రెస్ లీడర్లు ప్రారంభించడం పట్ల బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం చెప్తున్నారు.
బోథ్ నియోజకవర్గానికి మంత్రి సీతక్క ప్రతిపాదనల ద్వారా రూ.7 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభిస్తున్నారు. ఇటీవల బోథ్ లో కాంగ్రెస్ ఇన్చార్జి పనులు ప్రారంభించగా.. ప్రొటోకాల్ పాటించలేదంటూ బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. అయితే నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే కంటే ఎక్కువ నిధులు తీసుకొస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
రూ. 30.76 కోట్లతో పనులు
జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏడాది ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తారు. ఈ ఏడాది రూ. 30.76 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందులో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలతో పాటు జిల్లా పరిధిలోకి వచ్చే ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నార్నూరు, గాదిగూడ మండలాలు, ఖానాపూర్ నియోజకవర్గంలోకి వచ్చే ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో 516 సీసీ రోడ్లు, మురికి కాలువల పనులకు నిధులు మంజూరు చేశారు. గతంలో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటంతో వారే సీసీ రోడ్ల పనులు ప్రారంభించేవారు.
నిధులు కేటాయింపుల్లో సైతం ఎలాంటి సమస్య రాలేదు. ప్రస్తుతం ఆదిలాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ లతో పాటు ఎంపీ సోయం బాపురావు ప్రతిపాదనల మేరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కేటాయింపులు జరిగాయి. అయితే ఇందులో బోథ్ నియోజకవర్గానికి మంత్రి సీతక్క అధికంగా రూ.7 కోట్ల నిధులు కేటాయించారు. ఈ పనులన్నీ కాంగ్రెస్ ఇన్చార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఎమ్మెల్యేకు రూ.6.50 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలోనే తమ ఎమ్మెల్యే కంటే ఎక్కువ నిధులు కాంగ్రెస్ నాయకులకు ఎలా కేటాయిస్తారంటూ బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
31లోగా పూర్తి చేయాల్సిందే..
ఇదిలా ఉంటే ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం పూర్తికావడానికి 3 నెలల ముందు సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతారు. ఇలా చేపట్టిన పనులు మార్చి 31లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమయానికి నిధులు ఖర్చు చేయకుంటే తిరిగి వెనక్కి తీసుకుంటారు. అనేక సార్లు పనులు చేపట్టక నిధులు వెనక్కి వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి.
Also read : హరీశ్‌రావు.. మరో ఔరంగజేబు.. పదేండ్లు దోచుకొని.. ఇప్పుడు మళ్లా సీఎం కుర్చీ కావాల్నట: సీఎం రేవంత్
ప్రతి ఏడాది గడువు సమీపిస్తున్న సమయంలో హడావుడిగా పనులు చేపట్టడంతో నాణ్యతా లోపం తలెత్తుతోంది. కొంత మంది అధికారులు పనులను పరిశీలించకుండానే ఆమోద ముద్రవేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి అలా జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, ముందుగానే సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి పూర్తిచేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.