నీ చెల్లెలైనందుకు గర్వపడుతున్నా..ప్రియాంక ఎమోషనల్ ట్వీట్

నీ చెల్లెలైనందుకు గర్వపడుతున్నా..ప్రియాంక ఎమోషనల్ ట్వీట్
  •  రాహుల్ గాంధీకి ప్రియాంక ఎమోషనల్ ట్వీట్

న్యూఢిల్లీ: ప్రత్యర్థులు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఏనాడూ వెనకడుగు వేయలేదని ఆయన చెల్లెలు ప్రియాంకా గాంధీ మెచ్చుకున్నారు. కోపం, ద్వేషాన్ని తన ప్రేమ, దయాగుణంతో ఎదుర్కొన్నారని కొనియాడారు. ఎవరెన్ని నిందలేసినా సత్యం కోసం రాహుల్ తన పోరాటాన్ని ఆపలేదన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు లోక్​సభ సెగ్మెంట్లలో విజయం సాధించడం, లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గట్టెక్కించడంలో ఆయన కష్టపడిన తీరుపై ప్రియాంక ప్రశంసలు కురిపిస్తూ బుధవారం ఎమోషనల్ ట్వీట్ చేశారు.

 ‘‘వాళ్లు నిన్ను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు గట్టిగా నిలబడ్డావ్. అబద్ధాల ప్రచారంతో అణచివేయాలని చూసినా, అవమానించినా వెనక్కి తగ్గలేదు. సత్యం గెలుస్తుందనే నమ్మకంతో పోరాడావ్. నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకెళ్లావ్. వాళ్లు కోపం, ద్వేషం పంచినా సత్యం కోసం ప్రేమ, దయాగుణంతో పోరాటం చేసిన నువ్వు.. మాలో అందరికంటే ధైర్యవంతుడివి. ఇంతకాలం నిన్ను చూడలేనివారు ఇప్పుడు చూస్తారు”అని ప్రియాంక ట్వీట్ చేశారు. మీ చెల్లెలైనందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు.