ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 764 మంది కొత్త టీచర్లు

ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 764 మంది కొత్త టీచర్లు
  • ఇప్పటికే అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆర్డర్లు చేతికి..
  • నేడు కౌన్సెలింగ్‌‌‌‌.. ఆ తర్వాత స్కూళ్లలో జాయినింగ్‌‌‌‌ 
  • జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 272 మంది కొత్త టీచర్లు 

కరీంనగర్, వెలుగు: డీఎస్సీ- 2024 ద్వారా సెలక్టయిన టీచర్లకు స్కూళ్లలో పోస్టింగ్‌‌‌‌లు ఇచ్చేందుకు విద్యాశాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 9గంటలకు కౌన్సెలింగ్‌‌‌‌ ద్వారా ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని ఖాళీలను మెరిట్​ ప్రాతిపదికన కేటాయించనున్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌, సిరిసిల్ల, జగిత్యాల. పెద్దపల్లి జిల్లాల్లోని కలెక్టరేట్లలో కౌన్సెలింగ్‌‌‌‌ ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. 

డీఎస్సీ -2024 ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సెలక్టయిన 764 మందితో కూడిన అభ్యర్థుల మెరిట్ జాబితాను సెప్టెంబర్ 30న విద్యాశాఖ ప్రకటించి  1:3 పద్ధతిలో సర్టిఫికెట్‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌కు పిలిచారు. అనంతరం అభ్యర్థులు ఈ నెల 9న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్ మెంట్ ఆర్డర్లు అందుకున్న విషయం తెలిసిందే.   

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 219 మంది కొత్త టీచర్లు.. 

డీఎస్సీ -2024 ద్వారా కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 1 : 3 పద్ధతిలో మొత్తం 620 మంది అభ్య ర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలిచారు.  ఈ నెల ఫస్ట్ నుంచి 5వ తేదీ వరకు డీఈవో ఆఫీసులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. మొత్తం 245 టీచర్ పోస్టులకు గానూ రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల ప్రకారం  వీరిలో నుంచి 219 మందితో  ఈ నెల 8న ఫైనల్ జాబితా ప్రకటించారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్స్ 84, భాషా పండితులు 16, పీఈటీలు 5, ఎస్టీటీలు 100, స్పెషల్ ఎడ్యుకేటర్ ఎస్ఏ 5, స్పెషల్ ఎడ్యుకేటర్(ఎస్జీటీ)9 ఉన్నాయి. ఇవిగాక  మరో 26 పోస్టులకు మెరిట్ జాబితాలో అభ్యర్థులు లేని కారణంగా ఎవరినీ నియమించలేదు.

 ఇందులో స్కూల్ అసిస్టెంట్లలో 2, లాంగ్వేజ్ పండిట్లలో 2, పీఈటీల్లో 2, ఎస్జీటీల్లో 14, స్పెషల్ ఎడ్యుకేటర్ ఎస్జీటీలో 6 పోస్టులు ఉన్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే కౌన్సెలింగ్‌‌‌‌కు కేవలం అభ్యర్థులు మాత్రమే రావాలని డీఈవో జనార్ధన్ రావు సూచించారు. మూడు ఫొటోలు, ఒరిజినల్ అపాయింట్ మెంట్ లెటర్, ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని, ఇతరులను అనుమతి లేదని వెల్లడించారు.  

పెద్దపల్లి జిల్లాలో  93 మందికి అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌

పెద్దపల్లి, వెలుగు:  పెద్దపల్లి జిల్లాలో 93 మంది అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌​ఆర్డర్లు అందుకున్నారు. కాగా ఇందులో 20 బ్యాక్‌‌‌‌లాగ్‌‌‌‌ పోస్టులు ఉండగా. మిగిలిన 73 మందికి మంగళవారం కలెక్టర్ అప్రూవల్ తర్వాత వారికి కౌన్సెలింగ్‌‌‌‌ నిర్వహించి పోస్టింగ్ లు ఇవ్వనున్నారు.

రాజన్న జిల్లాలో 130 మంది..

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా 130 మంది టీచర్లు కొలువులో జాయిన్ కానున్నారు. ఇందులో ఎస్జీటీ 66  మంది ఉండగా  స్కూల్ అసిస్టెంట్63 మంది ఉన్నారు. పీఈటీలు 4గురు ఉండగా లాంగ్వేజ్ పండిట్లు 9 మంది ఉన్నారు. నేడు వీరందరికీ కలెక్టరేట్‌‌‌‌లోని విద్యాశాఖ ఆఫీస్‌‌‌‌లో కౌన్సెలింగ్‌‌‌‌ నిర్వహిస్తామని, రేపు వీరంతా స్కూళ్లలో చేరుతారని డీఈవో రమేశ్‌‌‌‌ తెలిపారు.