కన్న కొడుకు నుండి రక్షణ కల్పించాలని డీజీపీకి ఓ సిఐ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం వేధిస్తున్నాడని ఆ తల్లిదండ్రులు డీజీపికి మొర పెట్టుకున్నారు. కొడుకు నుండి రక్షణ కల్పించాలంటూ వేడుకున్నారు. వనపర్తి జిల్లా ఖల్లా ఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాధ్ రెడ్డి , బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు , ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సిఐగా, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అయితే రఘునాధ్ రెడ్డి కి ఉన్న 30 ఎకరాల 23 గుంటల భూమి ఉంది. అందులో పెద్దకొడుకు పేరుపై 15 ఎకరాలు , చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు రాసిచ్చారు. మిగిలిన భూమిని కుతుళ్లకు ఇచ్చేందుకు తమ వద్దే ఉంచుకున్నారు. కాగా వారి పెద్దకొడుకు సీఐ అయిన నాగేశ్వర్ రెడ్డి తనకు పేరుపై ఇంకో ఐదెకరాల భూమి రాయించాలని ఒత్తిడి చేస్తున్నాడు.
అది వినకపోయేసరికి పలుమార్లు తల్లిదండ్రులను దూషించడంతో పాటు దాడి చేసినట్లు ఆ వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. పెద్ద కొడుకు వేధింపులు తాళలేక తమ చిన్న కొడుకు యాదయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రస్తుతం తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2 లో సిఐగా విధులు నిర్వహిస్తున్నాడని అన్నారు. తన కొడుకు నాగేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు.