న్యూడిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనార్టీలకు భద్రత కల్పించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని భారత విదేశాంగ శాఖ కోరింది. హిందూ లీడర్ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుత నిరసనలు చేపట్టిన హిందువులు, మైనార్టీలపై లాఠీచార్జ్ సరికాదని పేర్కొంది. చిన్మయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేయడం, ఆయనకు బెయిల్ నిరాకరించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇటీవల నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసింది. దీంతో మంగళవారం ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కృష్ణదాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణదాస్ అరెస్ట్‌పై, బెయిల్ నిరాకరణపై తాము తీవ్ర ఆందోళనలో ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆయన అరెస్ట్‌కు నిరసనగా బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న హిందువులపై దాడులు చేయడం సరికాదని తెలిపింది. హిందు దేవాలయాలను అపవిత్రం చేయడం, మైనార్టీల ఇండ్లపై దాడులు, వారి వ్యాపార సంస్థలను దోచుకుంటున్న వారు పరారీలో ఉన్నారని, కానీ, తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ర్యాలీలో పాల్గొంటున్న కృష్ణదాస్‌పై ఆరోపణలు చేయడం దురదృష్టకమన్నారు.