మహబూబ్‌నగర్, వెలుగు: ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వృద్ధుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ఉచితంగా టెస్టులు చేయిస్తామని -పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తిమ్మసానిపల్లి, పద్మావతి కాలనీ, మెట్టుగడ్డ, దొడ్డలోనిపల్లి, కమలానెహ్రూ కాలనీ, సద్దలగుండు, న్యూ ప్రేమ్‌నగర్, 40 హౌసెస్ ఏరియా కాలనీ లబ్ధిదారులు నేషనల్ ఫంక్షన్ హాల్‌లో.. బండ్లగేరి, మదీనా మజీద్, వేపూరిగేరి, మైదానం ఏరియా, కిద్వాయిపేట కాలనీ లబ్ధిదారులకు మున్సిపల్ టౌన్ హాల్‌లో పింఛన్ కార్డులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో 2014 ముందు సుమారు 9 వేల మందికి నెలకు రూ.31.76 లక్షల పింఛన్లు మాత్రమే వస్తే.. ఇప్పుడు 20 వేల మందికి రూ. 4.24 కోట్లు ఇస్తున్నామని తెలిపారు.
కొడుకులు కూతుళ్లు ఆదరించకపోయినా ఆసరా పింఛన్లతో ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. వృద్ధుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా పరీక్షలు చేయించడంతో పాటు శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మందులు, కంటి అద్దాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో భారీ వర్షాలతో ఏర్పడిన ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకుపోగానే రూ.100 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేశారని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో సమావేశం పెట్టి.. ఎక్కడెక్కడ పనులు చేపట్టాలో నిర్ణయిస్తామని వివరించారు. వార్డుల అభివృద్ధి కోసం కష్టపడుతున్న కౌన్సిలర్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్ పాల్గొన్నారు.