ఢిల్లీ: యాదాద్రి విద్యుత్ కేంద్రానికి ఒడిశాలోని బొగ్గు నిక్షేపాలు కేటాయించాలని టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్ బుధవారం రాజ్యసభలో కోరారు. రాష్ట్రంలోని సింగరేణి నుంచి బొగ్గు వెలికితీయడానికి టన్నుకు 6 నుంచి 7 వందల రూపాయలు అదనంగా ఖర్చు అవుతోందని రాజ్యసభ జీరో అవర్ లో తెలిపారు. ఎక్కువ ఖర్చు కాకుండా యాదాద్రి విద్యుత్ కేంద్రానికి మందాకిని వద్ద ఉన్న నిక్షేపాలు కేటాయించాలని లింగయ్య కోరారు.
4వేల మెగావాట్ల సామర్థ్యం తో రూ.35వేల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ విద్యుత్ కేంద్రాన్ని చేపడుతోందన్నారు ఎంపీ. బీహెచ్ఈఎల్ కి విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులు అప్పగించినా… అనుకున్న సమయంలో పూర్తి చేయలేదన్నారు. ఈ కారణంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి అంటే… యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉచిత విద్యుత్ అమలు చేయడంతోపాటు.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని లింగయ్య యాదవ్ అన్నారు. కావున కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని… బిహెచ్ఈఎల్ కి తగిన ఆదేశాలు ఇచ్చి విద్యుత్ కేంద్ర నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని కోరారు.