- పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి
మెదక్, వెలుగు: రానున్న ఎన్నికల్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసనమండలిలో టీచర్ల గొంతుక అవుతానని పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ లో నూతన టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 1998 డీఎస్సీలో ఎంపికై 25 ఏళ్లు టీచర్‌గా పనిచేసి 2022లో వీఆర్ఎస్ తీసుకున్నానని తెలిపారు.
టీచర్‌గా పని చేసినపుడు స్వచ్ఛందంగా విద్యార్థుల చదువుకు చేయూత అందించడంతోపాటు, వీఎంఆర్ ఫౌండేషన్ ఏర్పాటుచేసి 500 గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు, బుక్కులు, పెన్నులు, టై, బెల్ట్‌లు వంటివి అందించానన్నారు. 1,500 స్కూల్ లకు వాల్ క్లాక్‌లు, కొన్నిస్కూల్ లకు వాటర్ ప్యూరిఫైర్లు అందించానన్నారు.
టీచర్ల సంక్షేమం, స్కూల్లలో నెలకొన్న సమస్యల పరిష్కారం, పటిష్టత కోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు తెలిపారు. పీఆర్టీయూలో మండల స్థాయి నుంచి అంచెలంచెలుగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన తనకు టీచర్ల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికైతే 13 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి వాటి ద్వారానే నిధులు ఖర్చు చేస్తానన్నారు. తాను మెదక్ లో టీటీసీ చేశానని, తన ఫస్ట్ పోస్టింగ్ మెదక్ జిల్లాలోనే అని గుర్తు చేశారు.
తమ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టడం జరిగిందని, ఇప్పటి వరకు 22,588 మంది టీచర్లు ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇతర సంఘాలు కూడా తనకు మద్దతు ఇస్తున్నాయని మహెందర్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుంకరి కృష్ణ, సామ్యానాయక్, వెంకట్ రాంరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి, బాధ్యులు శ్రీనివాస్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.