మన దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలు వివిధ కారణాల రీత్యా ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవల వైపు మొగ్గు చూపుతారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడే పేద, మధ్య తరగతి ప్రజలపై బ్యాంకింగ్ రంగం కూడా క్రమేపీ భారం మోపుతోంది. బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం లేదనే సాకుతో బ్యాంకులు ఖాతాదారుల వద్ద నుంచి ఎడాపెడా చార్జీలు వసూలు చేస్తున్నాయి. తాజాగా వచ్చిన గణాంకాలు చూస్తే మన మైండ్ బ్లాక్ అవక మానదు.
2019 నుంచి 2024 వరకు మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేయని ఖాతాదారుల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు జరిమానాల రూపంలో రూ.8,500 కోట్లు వసూలు చేశాయి. అందులో గతేడాదిలోనే రూ.2,331 కోట్లను బ్యాంకులు వసూలు చేశాయి. కాగా ఎస్బీఐ ఈ మినిమం బ్యాలెన్స్ చార్జీలను 2020 నుంచి పక్కనపెట్టగా మిగతా బ్యాంకులు మాత్రం ఇంకా కొనసాగిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఐదేండ్లలో ఈ వసూళ్లు 34 శాతానికిపైగా పెరిగాయి.
టాప్-5 బ్యాంకులివే..!
ప్రస్తుతం దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులుండగా అందులో మినిమం బ్యాలెన్స్ లేదని ఫైన్లు వసూలు చేసిన బ్యాంకుల్లో పీఎన్‌బీ, బీవోబీ, ఇండియన్ బ్యాంక్, కెనరా, బీవోఐ టాప్-5లో ఉన్నాయి. ఎస్బీఐ ఒక్క 2019-20లో గరిష్ఠంగా రూ.640 కోట్లు వసూలు చేసింది. కాగా ఆయా ప్రభుత్వ బ్యాంకులు కరెంట్, సేవింగ్స్ ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఉంచుకోవాలని సూచిస్తున్నాయి. లేనిచో నెలనెలా రూ.100 నుంచి రూ.600 దాకా జరిమానాలు విధిస్తున్నాయి.
కార్పొరేట్లకు నజరానాలు.. పేద, మధ్య తరగతి ప్రజలకు జరిమానాలు.!
మన దేశంలో కార్పొరేట్ సంస్థలు లక్షల కోట్లల్లో రుణాలు తీసుకుని ఎగవేసి దర్జాగా తిరుగుతున్నా మన బ్యాంకులు వారిని ఏమి చేయలేకపోతున్నాయి. కానీ సామాన్యుల దగ్గర నుంచి మాత్రం ముక్కుపిండి చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఓ వైపు దేశ ప్రజలందరికీ.. ముఖ్యంగా పేద ప్రజలకు బ్యాంకింగ్ సేవలను దగ్గర చేస్తామని స్పీచులు దంచే మోడీ ప్రభుత్వం ఈ జరిమానాలపై నోరు మెదపట్లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ప్రజలు ఏమంటున్నారు..?
ఏ పనిలో ఉన్నా సరే ప్రతి నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలని పేద, మధ్య తరగతి వర్గాలు ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు ఎలా మొయింటెన్ చేయగలరు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర అవసరాల కోసం తీసుకుంటున్న ఖాతాలపై సైతం జరిమానాలు విధించిడం ఎంత మేరకు సమంజసం అనే వాదనలు వినిపిస్తున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్న ఈ జరిమానాల విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.