వరంగల్ లో సైకో వీరంగం..జనంపై రాళ్లతో దాడి.. ఐదుగురికి గాయాలు

వరంగల్ సిటీ వెలుగు : వరంగల్ లో గురువారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. జనంపై రాళ్లు, కట్టెలు విసురుతూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. అతని దాడిలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని కోసగి ప్రాంతానికి చెందిన కుస్లాం అనే వ్యక్తి గురువారం ఉదయం వరంగల్  రైల్వే స్టేషన్ లో కరెంట్ షాక్ కు గురయ్యాడు. ఈ ఘటనలో అతనికి కాలిన గాయాలు కావడంతో 108లో ఎంజీఎంకు తరలించారు. మద్యం మత్తులో ఉన్న అతను.. అందరినీ బెదిరిస్తూ ఎంజీఎం ఆసుపత్రి నుంచి ఎవరికీ దొరకకుండా పరుగులు తీశాడు.

పోచమ్మ మైదాన్  సెంటర్ కు చేరుకొని రాణి రుద్రమ విగ్రహం వద్దకు వెళ్లి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. కాలిన గాయాలతో పాటు అర్ధనగ్నంగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అతడిని కిందకు దింపేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నించగా వారిపై రాళ్లు విసిరాడు. ఎట్టకేలకు సైకోను కిందికి దింపి దేహశుద్ధి చేసి మళ్లీ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఎంజీఎంలో 48 శాతం కాలిన గాయాలతో అతను చికిత్స పొందుతున్నాడు. ఇతడు మాట్లాడలేని స్థితిలో ఉండడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.