- బ్రహ్మకుమారీస్తో ఎంవోయూ
- బదిలీలు, ప్రమోషన్లలో సమస్యలను పరిష్కరిస్తున్నం
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకులాల్లో సైకాలజీ క్లాసులు ప్రారంభిస్తామని ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి తెలిపారు. విద్యార్థుల్లో ఆందోళన తగ్గించడం, ఆత్మహత్యలను అరికట్టడం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సైకాలజీ క్లాసుల నిర్వహణ కోసం బ్రహ్మకుమారీస్ సంస్థతో వచ్చే నెల 2న ఒప్పందం చేసుకుంటామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్ లో మీడియాతో ఆమె మాట్లాడారు. సైకాలజీ క్లాసులపై ముందుగా టీచర్లకు అవగాహన కల్పిస్తామన్నారు.
వచ్చే నెల 5 నుంచి అక్టోబర్ 26 వరకు టీచర్లకు బ్యాచ్‌లో వారీగా ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. స్టూడెంట్లకు బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 15 రోజులకోసారి క్లాసులు ఉంటాయని చెప్పారు. ప్రధానంగా మెడిటేషన్, మోటివేషన్, ఆందోళన నుంచి బయటపడడం వంటి అంశాలుంటాయన్నారు. ఐదో తరగతిలో అడ్మిషన్ తీసుకుని గురుకులాల్లోకి అడుగుపెడుతున్న విద్యార్థులు ఒంటరిగా ఫీలవుతున్నారని, దాన్ని దూరం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిస్థితులు, స్నేహితులు ఒకేసారి మారడంతో ఇబ్బంది పడుతున్నారని, వారు తల్లిదండ్రులను కలిసేందుకు వీలైనంత అవకాశం కల్పిస్తున్నామన్నారు.
ప్రతి స్కూల్లో మెస్ కమిటీలు
ప్రతి ఎస్సీ గురుకులంలో అధికారులు, పిల్లలతో కలిసి మెస్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వర్షిణి వెల్లడించారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు మెనూను మానిటరింగ్ చేసే అవకాశం ఉంటున్నారు. కొన్ని ప్రాంతాల్లోని గురుకుల స్టూడెంట్స్‌లో రక్తహీనత ఉందని, దీన్ని అధిగమించేందుకు రాష్ట్రీయ బాల స్వాస్థీయ కార్యక్రమం (ఆర్బీఎస్ కే) లోని డాక్టర్లతో మాట్లాడుతున్నామన్నారు.
అలాగే 230 మంది టీచర్లకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించామని, వాళ్ల ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ ప్రోగ్రామ్స్‌పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అద్దె భవనాల రిపేర్ల కోసం రూ.60 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశామని తెలిపారు. ఈ నెల 29న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమీక్ష ఉన్నదని, అందులో గురుకులాల్లో సౌకర్యాల పెంపుపై చర్చిస్తామని చెప్పారు