న్యూఢిల్లీ: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)లో విభేదాలు మరింత ముదిరాయి. సంఘాన్ని నిరంకుశ పద్ధతిలో నడిపిస్తుందని ఆరోపిస్తూ తనపై తిరుగుబాటు చేసిన 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) మెంబర్లపై ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష ఎదురుదాడికి దిగింది. వాళ్లంతా దేశ క్రీడాభివృద్ధి కోసం పని చేయడం కంటే తమ అధికార దర్పం, స్వలాభంపైనే ఎక్కువ దృష్టి సారించారని విమర్శించింది. సదరు ఈసీ మెంబర్లలో పలువురిపై లైంగిక వేధింపులు కేసులు కూడా ఉన్నాయని చెబుతూ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారిణిగా తన 45 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌లో మన అథ్లెట్ల ఆకాంక్షలు, దేశ క్రీడా భవిష్యత్తు ఏమాత్రం పట్టింపులేని ఇలాంటి వ్యక్తులను తను ఎన్నడూ ఎదుర్కోలేదని చెప్పింది. కొన్ని రోజుల కిందట జరిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్‌లో ఐఓఏ సీఈఓ పోస్టు నుంచి రఘురామ్ అయ్యర్‌ను తొలగించాలని ఈసీ మెంబర్స్ డిమాండ్ చేయగా.. ఉష ఒప్పుకోలేదు. దాంతో, ఈ మీటింగ్ రసాభాసగా మారింది. ఈ క్రమంలో ఐఓఏను ఉష నిరంకుశంగా నడిపిస్తుందంటూ 12 మంది ఈసీ మెంబర్స్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ (ఐఓసీ) ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ జెరోమ్ పొయివేకు లెటర్ రాశారు. అయితే, ఈ ఏడాది జనవరిలో ఐఓఏ రాజ్యాంగం ప్రకారమే రఘురామ్ అయ్యర్ నియామకం జరిగిందని ఉష స్పష్టం చేసింది. దీన్ని ప్రశ్నించడంలో అర్థం లేదని చెప్పింది. తన నాయకత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే 12 మంది ఈసీ మెంబర్స్ ద్వేషపూరిత, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది.