- పీఎంయూఎస్హెచ్ఏ కింద మంజూరు
- హాస్టళ్లు, భవనాల నిర్మాణానికి రూ.78 కోట్లు కేటాయింపు
- మైనర్ రిపేర్లు, ల్యాబ్స్ ఆధునికీకరణకు మిగిలిన ఫండ్స్
మహబూబ్‌నగర్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)కి పెద్ద మొత్తంలో ఫండ్స్ వచ్చాయి. ప్రధాన మంత్రి శిక్ష ఉచ్ఛతర్ అభియాన్(పీఎంయూఎస్హెచ్ఏ) స్కీం కింద రూ.వంద కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.78 కోట్లు వర్సిటీలో కొత్త హాస్టళ్లు, బిల్డింగుల కోసం ఖర్చు చేయనున్నారు. భవనాలు, ఇతర మైనర్ రిపేర్ల కోసం రూ.3.60 కోట్లు, ల్యాబ్‌లలో అత్యాధునిక పరికరాల కోసం రూ.14.26 కోట్లు, రీసెర్చ్, బోధన, శిక్షణ తదితర వాటి కోసం రూ.3.22 కోట్లు కేటాయించారు.
నిధుల కేటాయింపు ఇలా..
పీయూ దాదాపు 176 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం వర్సిటీకి పెద్ద మొత్తంలో ఫండ్స్ రావడంతో డెవలప్మెంట్ వర్క్స్‌ను త్వరలో మొదలుపెట్టనున్నారు. వర్సిటీకి ఇటీవల లా, ఇంజనీరింగ్ కాలేజీలు శాంక్షన్ కాగా, ఈ కాలేజీలకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్, అకడమిక్, హాస్టళ్ల నిర్మాణానికి ఈ ఫండ్స్ కేటాయించనున్నారు. అలాగే 20 బెడ్స్‌తో హాస్పిటల్, ఇంక్యూబేషన్ సెంటర్, కొత్త ఆడిటోరియం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న లైబ్రెరీని విస్తరించనున్నారు. వనపర్తి పీజీ సెంటర్లో హాస్టల్ బిల్డింగ్, ఇండోర్ స్టేడియం నిర్మించనున్నారు.
ఇందుకోసం దాదాపు రూ.78 కోట్లు ఖర్చు చేయనన్నారు. అలాగే సైన్స్ ల్యాబ్స్ కోసం దాదాపు రూ.14 కోట్లు కేటాయించారు. ఇందులో ట్రాన్స్మిషన్ ఎలక్ట్రో మైక్రోస్కోప్ కోసం రూ.2 కోట్లు, ఎక్స్‌రే ప్రొటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రో మీటర్ కోసం రూ.కోటి, ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్‌కు రూ.20 లక్షలు, ఫ్లాష్ క్రొమెటోగ్రఫీకి రూ.25 లక్షలు, హెచ్పీఎల్సీ(3)కి రూ.60 లక్షలు, ఎఫ్టీఐఆర్(2)కు రూ.40 లక్షలు, హైస్పీడ్ టేబుల్ ప్రెస్ మిషన్‌కు రూ.15 లక్షలు, రోటో ఎవాపరేట్ విత్ చిల్లర్(4)కు రూ.5 లక్షలు, హెచ్టీపీసీఎల్(2)కు రూ.25 లక్షలు, సెంట్రిఫ్యూజ్కు రూ.25 లక్షలు, కోల్డ్ స్టోరేజ్, టెంపరేచర్ మానిటరింగ్‌కు రూ.కోటి, జెల్ డాక్యుమెంటేషన్ విత్ పీసీఆర్ 2డీ జెల్ ఎలక్ట్రోలసిస్కు రూ.1.5 కోట్లు, యూవీ స్పెక్టోమీటర్(6)కు రూ.6 లక్షలు, ఎన్‌ఎంఆర్‌కు రూ.1.6 కోట్లు, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌కు రూ.కోటి, మోసబీయర్ స్పెక్టోమీటర్కు రూ.80 లక్షలు, పవర్ సప్లయ్ సిస్టంకు రూ.12 లక్షలు, లేటెస్ట్ 13 జనరేషన్ 200 కంప్యూటర్లకు రూ.2 కోట్లు కేటాయించారు.
ప్రపోజల్స్ పంపిన ఐదు నెలల్లోనే..
సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లోని పీయూను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో దాదాపు పదేండ్లుగా ఇక్కడ సమస్యలు తిష్ట వేశాయి. సరైన బిల్డింగులు లేవు. స్టూడెంట్లకు తగ్గినన్ని హాస్టళ్లు లేవు. మౌలిక వసతులు, ఇతరత్రా సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో 2023 డిసెంబర్లో పీఎంయూఎస్హెచ్ఏ స్కీమ్‌కు అప్లై చేసుకోవాలని దేశంలోని అన్ని వర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.
అప్పటికే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పీయూ ఆఫీసర్లను డెవలప్మెంట్ పనులకు సంబంధించిన ప్రపోజల్స్ రెడీ చేయాలని ఆదేశించారు. వారు ప్రపోజల్స్ తయారు చేసి రాష్ట్ర సర్కారుకు అందించగా, ఈ ప్రపోజల్స్‌ను సీఎం యూఎస్‌హెచ్‌ఏ రాష్ట్ర కో ఆర్డినేటర్ ద్వారా కేంద్రానికి పంపారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం ఢిల్లీకి వెళ్లి స్కీం కింద వర్సిటీని ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఫిబ్రవరిలో దేశంలోని 26 వర్సిటీలను ఈ స్కీ కింద ఎంపిక చేయగా, అందులో పీయూకు కూడా చోటు కల్పించారు. ప్రపోజల్స్ పంపిన ఐదు నెలల్లోనే వర్సిటీకి రూ.వంద కోట్లు శాంక్షన్ చేశారు.
పీయూ హిస్టరీలోనే రికార్డ్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వర్సిటీకి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యింది. రాష్ట్ర బడ్జెట్ కేటయింపుల్లోనూ ఈ వర్సిటీకి పదేండ్లుగా ప్రియారిటీ ఇవ్వలేదు. కేవలం జీతాలకు తప్ప, డెవలప్మెంట్కు తక్కువ నిధులు కేటాయించింది. 2017లో కేంద్రం నుంచి రూసా స్కీం కింద రూ.18 కోట్లు రాగా, ఆ ఫండ్స్‌తో కొంత అభివృద్ధి జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి పీయూకు అత్యధికంగా 2012–13 రాష్ట్ర బడ్జెట్లో రూ.16 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో డెవలప్మెంట్కు నిధులు రాలేదు. 11 ఏండ్ల తర్వాత ఎమ్మెల్యే యెన్నం వర్సిటీకి రికార్డు స్థాయిలో రూ.వంద కోట్ల నిధులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.
హ్యాపీగా ఉంది..
వర్సిటీలో ఇప్పటి వరకు స్టూడెంట్లకు సరిపడా హాస్టల్స్ లేవు. బాత్ రూమ్స్‌కు డోర్లు కూడా లేవు. స్టూడెంట్లకు అనుగుణంగా రెండు బాయ్స్ హాస్టల్స్ కట్టించాలి. పీఎంయూఎస్హెచ్ఏ స్కీం కింద వర్సిటీకి రూ.వంద కోట్లు మంజూరుకావడం హ్యాపీగా ఉంది.
గణేశ్, ఎంఎస్ఎఫ్ పీయూ ప్రెసిడెంట్
రీసెర్చ్ బిల్డింగ్ కట్టాలి..
వర్సిటీలో రీసెర్చ్ బిల్డింగ్ కట్టాలి. స్పోర్ట్స్ కు నిధులు కేటాయించాలి. ఎస్టీ గర్ల్స్, బాయ్స్‌కు వేర్వేరుగా హాస్టల్ నిర్మాణానికి గతంలో ఫండ్స్ వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు ఈ బిల్డింగ్‌ను కట్టలేదు. వాటికి నిధులు కేటాయించి బిల్డింగ్‌ను కట్టించాలి. అలాగే షటిల్, బ్యాడ్మింటన్ కోర్ట్‌లను ఏర్పాటు చేయాలి.
రూప్ సింగ్, బీఎస్ఎం పీయూ ప్రెసిడెంట్