మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పీయూ ముట్టడి నిర్వహించారు. వీసీ ఛాంబర్ ని ముట్టడించి నినాదాలతో హోరెత్తించారు. వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో, లిఖితపూర్వకంగా రాసివ్వాలని కోరారు. వీసీ నిరాకరించడంతో ఛాంబర్ కు తాళం వేశారు.
దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వెనక్కి తగ్గలేదు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, కోర్సుల వారీగా సెమిస్టర్ ఫీజులు తగ్గించాలని, సౌలతులు సరిగా లేని డిగ్రీ, పీజీ కాలేజీల అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించుకుంటే మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నరేంద్ర, నరేశ్ తేజ, మల్లికార్జున్, సతీశ్ కుమార్, జగదీశ్, అర్జున్, శివ, మానస పాల్గొన్నారు.