- మొత్తం దరఖాస్తులు 4.80 లక్షలు
- 3,32,663 ఇండ్ల కోసం..
- చేయూత కోసం కొత్తగా 1,57,205
నిజామాబాద్, వెలుగు: ప్రజాపాలన దరఖాస్తుల వివరాలు అధికారులు డేటా ఎంట్రీ పూర్తి చేశారు. ఆర్జీలు భారీగా రావడంతో ఆన్లైన్ ఆలస్యం అయినట్టు అధికారులు తెలిపారు. ఈ డేటా ఎంట్రీ రెండు రోజుల కింద ముగిసింది. మొత్తం 4,80,294 దరఖాస్తులు రాగా ఆరు గ్యారెంటీలతో సంబంధంలేని ఇతర విన్నపాలు 1,12,564 ఆఫీసర్లకు చేరాయి. ఇందులో ఇండ్ల కు భారీగా 3,32,663 దరఖాస్తులు అందాయి. గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాక స్కీముల మంజూరు అర్హతలపై విచారణ నిర్వహించనున్నారు.
కొత్తగా పింఛన్ కోసం జిల్లాలో వృధాప్య, వితంతు తదితర పింఛన్ లబ్ధిదారులు 2,78,749 మంది ఉన్నారు. కొత్తగా 1,57,205 మంది పింఛన్ అర్జీలు పెట్టుకున్నారు. ఇందులో ఆల్రెడీ పింఛన్ పొందుతున్న వారూ ఉన్నట్టు ఆఫీసర్లు భావిస్తున్నారు. కొత్తగా పథకాలు కావాలనుకునే వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని గవర్నమెంట్ సూచించినా కొందరు కన్ఫ్యూజ్కు లోనై ఆర్జీలు పెట్టారు. అన్ని రకాల వంట గ్యాస్ కనెక్షన్లు కలిపి జిల్లాలో 4,27,258 ఉండగా గవర్నమెంట్ సబ్సిడీ సిలిండర్ కోసం 4,07,245 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇండ్ల సంఖ్యకు దాదాపు సమానంగా గృహజ్యోతి జిల్లాలోని 530 విలేజ్ల్లో 2,75,183, నిజామాబాద్ నగర పాలిక, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలో 1,29,866 నివాసాలు ఉన్నాయి. అయితే జిల్లాలో నివాసాల సంఖ్యకు దాదాపు సమానంగా 3,89,582 గృహజ్యోతి అప్లికేషన్లు వచ్చాయి. 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంటు కోసం ఈ దరఖాస్తులు అందించారు. ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సహాయాన్ని కోరుతూ 3,55,347 మంది యువతులు మహాలక్ష్మీ స్కీం ఆర్జీలు ఇచ్చారు. ఇండ్లు మంజూరు చేయాలని 3,32,663 ఆర్జీలు రాగా 250 గజాల ఇంటి స్థలం కోసం ఉద్యమకారుల హోదాలో 2,973 మంది దరఖాస్తు చేశారు.
రైతు భరోసా కోసం 1,49,848 రైతుబంధు స్థానంలో పంట పెట్టుబడి సహాయాన్ని ఎకరానికి రూ.15,000కు పెంచిన కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి రైతు భరోసా పేరు పెట్టింది. జిల్లాలో రైతు బంధు లబ్దిదారులు 2,55,461 ఇప్పటికే ఉండగా ప్రజాపాలనలో 1,49,848 మంది రైతులు భరోసా పథకానికి దరఖాస్తు చేశారు. ఇందులో కొత్తగా ఆర్జీ పెట్టుకున్న వారి సంఖ్య తేలాల్సి ఉంది.
వ్యవసాయ కూలీలు 1,80,511 మంది రూ.12 వేల పథకం కోసం ఆర్జీ ఇచ్చారు. ఉపాధి హామీ జాబ్ కార్డులను జతచేశారు. ఎక్కువగా భూసమస్యలే.. ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలకు అదనంగా పౌరులు ఇచ్చిన 1,12,564 దరఖాస్తుల్లో ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ధరణి సమస్యతో పట్టాపాస్ బుక్స్రాని వారు, భూమి హద్దులు, ఇంటి జాగాల ఆర్జీలు, ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ వినతులు అందించారు. ప్రతి ఆర్జీని అప్లోడ్ చేశారు.