నిరసనలు..నిలదీతలు .. రెండో రోజు సైతం గ్రామసభల్లో ఆందోళనలు

నిరసనలు..నిలదీతలు .. రెండో రోజు సైతం గ్రామసభల్లో ఆందోళనలు

మెదక్​, శివ్వంపేట, మనోహరాబాద్​, టేక్మాల్​, వెలుగు:​ ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి నిర్వహిస్తున్న ప్రజా పాలన గ్రామసభల్లో రెండో రోజు బుధవారం పలు చోట్ల ఆందోళనలు వ్యక్తమయ్యాయి.   మనోహరాబాద్​  మండలం రంగాయిపల్లి గ్రామంలో సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక సరిగా జరగలేదని, అర్హుల పేర్లు లిస్ట్​లో లేవని ప్రజలు మండిపడ్డారు.  శివ్వంపేట మండలం పాంబండలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లేనివారి పేర్లు కాకుండా, ఇళ్లు ఉన్నవారి పేర్లు ఎంపిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లుట్లలో తొలిరోజు గ్రామసభ బ్యానర్​ పై ఎంపీ, ఎమ్మెల్యే ఫొటో పెట్టలేదని అడిగితే కేసు నమోదు చేశారంటూ బుధవారం బీజేపీ, బీఆర్​ఎస్​ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

 రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్  ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపికలో అవతవకలు జరిగాయని ఆరోపిస్తూ  ప్రజాపాలనలో  అధికారులపై  గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  నార్సింగి మండల కేంద్రంలో  గ్రామసభలో గందరగోళం నెలకొంది. అసలైన నిరుపేదల పేర్లు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, రేషన్ కార్డులకు ఎంపిక చేయడం లేదంటూ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌడిపల్లి మండలం  తిమ్మాపూర్, కొట్టాల గ్రామసభల్లో గందరగోళం జరిగింది. -ఆయా పథకాలకు లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అర్హులైన వారికి పథకాలు అందుతలేవని అధికారులపై మండిపడ్డారు. - సంఘటన  స్థలానికి పోలీసులు చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పారు.