- ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
నెట్వర్క్, వెలుగు: ప్రజాపాలన దినోత్సవాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా ల్లోని కలెక్టరేట్లలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొని జెండా ఆవిష్కరించారు. నిర్మల్కలెక్టరేట్లో జరిగిన వేడుకలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు వివరించారు. నిర్మల్ జిల్లా అభివృద్ధికి అధికారులు మరింత కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్‌తో కలిసి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం విద్యాశాఖ ఆధ్వర్యంలో బాలశక్తి కార్యక్రమ పోస్టర్లను రిలీజ్ చేశారు.
ఆరోగ్య తెలంగాణనే సర్కారు లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి అర్హులైనవారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్లో జరిగిన వేడుకలకు చీఫ్‌గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమైందన్నారు. గతేడాది డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలో లక్షా 45 వేల 549 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
6 గ్యారంటీల్లో రెండింటిని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లో అమలు చేసి చరిత్ర సృష్టించిందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, సబ్సిడీలు, ఇతర పథకాలను వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దండే విఠల్, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్, అడిషనల్ కలెక్టర్లుదీపక్ తివారీ, దాసరి వేణు, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల త్యాగాలు మరువలేనివి
దేశం, రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వేడుకలకు కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్‌తో కలిసి హాజరై గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరవీరులు చేసిన పోరాటాల ఫలితంగా నేడు స్వేచ్ఛను అనుభవిస్తున్నామన్నారు.
రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, 6 గ్యారంటీల అమలు కోసం అధికార యంత్రాంగంతో కలిసి నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సభావత్ మోతిలాల్, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ కేంద్రాలు, మండలాల్లో జరిగిన వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని జెండా ఆవిష్కరించారు.
అభివృద్ధిలో దూసుకుపోతున్నం
చివరి వరుసలో ఉన్న పేదోళ్లకు కూడా ప్రభుత్వ పథకాలు అందించాలని కాంగ్రెస్ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వ సలహదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. ఆదిలాబాద్కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంద న్నారు. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతు ప్రభుత్వంగా నిలిచామని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, పంచాయతీతోపాటు పలు రంగాల్లో రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.