ఆదిలాబాద్​ లో ముగిసిన ప్రజాపాలన సభలు

ఆదిలాబాద్​ నెట్​వర్క్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం గ్యారంటీల అమలు కోసం డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన సభలు సజావుగా ముగిశాయి. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రైతుబంధు కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు.

రేషన్ కార్డుల కోసం కూడా పెద్దసంఖ్యలో అప్లికేషన్లు అందజేశారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 2,47,674 హౌస్ హోల్డ్స్ కు గానూ అభయహస్తం గ్యారంటీల కోసం 2,50,602 అప్లికేషన్లు వచ్చాయి. రేషన్ కార్డులు, ఇతర సమస్యలపై 32,660 కలిపి 8 రోజుల్లో మొత్తం 2,83,262 దరఖాస్తులు అందాయి. వీటిని ఈ నెల 17 వరకు ఆన్​లైన్​లో నమోదు చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు.

దరఖాస్తుల వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అన్​లైన్​లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మున్సిపల్ ఆఫీసులో కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియతో పాటు ఆన్​లైన్​లో వివరాలు నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. గుడిహత్నూర్‌ మండలంలో 10,209 మంది దరఖాస్తు చేసుకోగా కొత్త రేషన్‌ కార్డులు, రేషన్ కార్డుల్లో మార్పుల కోసం 2177 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంపీడీఓ బండి అరుణ తెలిపారు. పెంబి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులు, నేతలతో కలిసి ఎమ్మెల్యే బొజ్జు పటేల్​పాల్గొని అర్జీలను స్వీకరించారు.

భైంసా మండలం మహగాంలోని ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్​పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చూస్తానన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరపాలని అధికారులకు సూచించారు.​ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ గార్డెన్​లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్ ​రావు పాల్గొన్నారు.