- ఏర్పాట్లపై సీఎం, మంత్రుల చర్చ
హైదరాబాద్, వెలుగు : ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మీటింగ్ చీఫ్ గెస్ట్‌గా ఎవరిని పిలువాలన్న అంశంతోపాటు ఏర్పాట్లపై బుధవారం రాత్రి సీఎం ఇంట్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రేవంత్‌రెడ్డి రెండు గంటల పాటు చర్చించారు.
అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ వచ్చే అవకాశం లేకపోవడంతో రాహుల్, ప్రియాంక గాంధీల్లో ఒకరిని రప్పించాలని నిర్ణయించారు. వారు రాని పక్షంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేని ఆహ్వానించాలని మీటింగ్ లో చర్చించినట్టు తెలుస్తున్నది. కుల గణనకు ప్రజల నుంచి వస్తున్న స్పందన, పార్టీ నేతలు ఎంతవరకు ఈ ప్రోగ్రామ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు అనేది మంత్రులు, పీసీసీ చీఫ్‌ను సీఎం ఆరా తీసినట్టు సమాచారం.
కుల గణనను అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు పార్టీ తరఫున కార్యకర్తలు కూడా కృషి చేయాలని, ఇందుకోసం అదేశాలు ఇవ్వాలని పీసీసీ చీఫ్‌కు సీఎం సూచించినట్టు తెలుస్తున్నది. కీలక నామినేటెడ్ పోస్టులు, ఆర్టీసీ, సివిల్ సప్లై, మూసీ రివర్ ఫ్రంట్, రెడ్కో వంటి ఇతర కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ పైనా నేతలతో సీఎం చర్చించినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.