
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లాలోని పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, గృహలక్ష్మి పథకం కింద రూ.15 లక్షలు ఇవ్వాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు కలెక్టరేట్‌లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం కొద్దిమందికి అవకాశం ఇవ్వగా.. వాళ్లు కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్పం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎ. మల్లేశం మాట్లాడుతూ... 2006లో రామయంపేట మండలం పర్వతాపూర్, కాట్రియాల , మెదక్ పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లు ఇచ్చినా, ఇప్పటి వరకు పొజిషన్ చూపలేదని వాపోయారు.
Also Read : ఫస్ట్ ఛాయిస్ శ్రీవిష్ణునే..
అలాగే గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే రూ.3 లక్షలు ఇల్లు బేస్‌మెట్‌కు కూడాసరిపోవని మండిపడ్డారు. గ్రామాల్లో గుడిసెల్లో ఉంటున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, మెదక్ తహసీల్దార్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజ్, కోశాధికారి నర్సమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, ఆవాజ్ జిల్లా కన్వీనర్ మోహినొద్దీన్, లచ్చాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.