హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ప్రజా సంఘాలు ధర్నాకు దిగాయి. ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలంటూ ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. 2016లో అర్హులకు ఇండ్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ హామీని నిలబెట్టుకోవాలని లబ్దిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం నాలుగు వేలకు పైగా డుబల్ బెడ్రూం ఇండ్లను మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు అర్హులైన వారందరికీ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని.. ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని వివిధ కాలనీలు, బస్తీల నుంచి వచ్చిన మహిళలు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నాలో పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
రాష్ర్ట ప్రభుత్వం హామీ ఇచ్చి దాదాపు తొమ్మిదేళ్లు గడిచినా ఇంకా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదని ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ అర్హులకు పూర్తిస్థాయిలో ఇవ్వలేదన్నారు. గృహలక్ష్మీ పథకం కింద రూ. 3 లక్షలు సరిపోవని, రూ.5 లక్షలు ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం 10 లక్షల వరకు అప్లికేషన్స్ వచ్చాయని, వాటిని అధికారులు సరిగా వెరిఫికేషన్ చేయలేదంటున్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.