- సెంట్రల్ సెక్రటరీ సంజీవ్ చోప్రా కితాబు
- పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్, అధికారులతో భేటీ
హైదరాబాద్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు అభినందనీయమని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా అన్నారు. శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన చోప్రా.. సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్, ఎఫ్‌సీఐ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ జెయింతా లాజరస్తో సివిల్ సప్లయ్స్ భవన్లో భేటీ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ధాన్యం సేకరణ, రేషన్ పంపిణీ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చోప్రా మాట్లాడుతూ ధాన్యం సేకరణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడంలో, సమర్థవంతమైన విధానాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీ రంగంలో తెలంగాణ రోల్ మోడల్ అని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ధాన్యం సేకరణ ప్రక్రియలో అమలు చేస్తున్న విధివిధానాలపై సివిల్ సప్లయ్స్ కమిషనర్, డీఎస్ చౌహాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సిస్టమ్‌ను మరింత మెరుగు పరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని కోరారు. అనంతరం ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీకి సంబంధించిన వ్యవస్థను మెరుగుపరిచేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్ పై చర్చించారు.
పర్యటనలో భాగంగా చోప్రా జన్ పోషణ్ సెంటర్‌ను సందర్శించారు, స్మార్ట్ ఎఫ్‌పీఎస్ పథకం కింద కొత్త ఏఐజీ కాలనీలో ఏర్పాటు చేసిన షాప్ నంబర్ 819 సందర్శించారు. జంబో టెయిల్, ఉడాన్ పథకాలు అందించే క్రెడిట్ సౌకర్యాలను పరిశీలించారు. డీలర్‌తో మాట్లాడి ప్రజాపంపిణీ విధానం, వస్తున్న కమీషన్ గురించి
అడిగి తెలుసుకున్నారు.