ఆస్తులు తెలుస్తయని ఆధార్​ ఇయ్యట్లే!

ఆస్తులు తెలుస్తయని ఆధార్​ ఇయ్యట్లే!
  • ఫ్రీ వాటర్ స్కీంకు ఓనర్ల నుంచి రెస్పాన్స్​ అంతంతే
  • గ్రేటర్​లో నల్లా కనెక్షన్​కు సీడింగ్ మస్ట్​ అంటున్న వాటర్​బోర్డు 
  • సిబ్బంది అవేర్​నెస్ ​చేస్తున్నా ఇంటి ఓనర్లు ముందుకురావట్లే
  • ఆస్తుల వివరాలు తెలిసిపోతాయని భయపడుతున్న యజమానులు

నాలుగు రోజుల కిందట హిమాయత్ నగర్ లోని ఓ ఇంటికి వాటర్​బోర్డు సిబ్బంది వెళ్లారు. ఫ్రీ వాటర్ స్కీమ్​కు ఆధార్​ సీడింగ్ చేసుకోవాలని ఓనర్​కు చెప్పి అవేర్​నెస్​చేశారు. అయితే ఆయనకు సిటీలో వివిధ ఏరియాల్లో 10 ఫ్లాట్లు ఉన్నాయి. సీడింగ్​చేసుకుంటే తన ఆస్తులన్నీ ఎక్కడ తెలిసిపోతాయనే భయంతో వివరాలు చెప్పమని    ప్రామిసరీ నోట్ రాసిస్తారా? అంటూ సిబ్బందిని ప్రశ్నించాడు.వచ్చే రూ. 350 బిల్లుకు ఆస్తుల వివరాలు బయటపెట్టుకోవాలా? ’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అయోమయానికి గురైన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో​ ఫ్రీ వాటర్​స్కీమ్ కు ఆధార్ లింకేజీపై ఇంటి ఓనర్లు ఇంట్రెస్ట్​ చూపడం లేదు.  లబ్ధి పొందాలంటే కనెక్షన్​కు ఆధార్ వివరాలను అనుసంధానించాలి. కానీ వివరాలు ఇచ్చి ఆ తర్వాత ఇబ్బంది పడడం ఎందుకని ఓనర్లు ఆధార్​ సీడింగ్​చేసుకోవడం లేదు. ఇంటింటికి వెళ్లి వాటర్ బోర్డు సిబ్బంది అవేర్​నెస్​ కల్పిస్తున్నా ఓనర్లు నల్లా కనెక్షన్​   సీడింగ్ కు ముందుకురావడం లేదు. వచ్చే మూడు, నాలుగు వందల రూపాయల బిల్లుకు ఆధార్ లింకేజీ ఎందుకని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

ఆధార్​ సీడింగ్​ మస్ట్​ కావడంతో..

గ్రేటర్ ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం 20 వేల లీటర్లను ఫ్రీగా సప్లయ్ చేస్తామని ప్రకటించింది. దీనికి వాటర్ బోర్డు అధికారులు ఆధార్ వివరాలను క్యాన్ నెంబర్ తో మస్ట్​గా లింకేజీ చేయాలనే కండిషన్ పెట్టారు.  బస్తీల్లో ఆధార్ సీడింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, ఇంటింటికి తిరుగుతూ వాటర్ బోర్డు అధికారులు వివరాలు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరికి వారు ఆన్ లైన్ లోనూ  సీడింగ్ చేసుకునే  ఫెసిలిటీ కూడా ఉంది.  కానీ ఈవివరాలను నమోదు చేసుకునేందుకు సిటీ జనం ఇంట్రెస్ట్​ చూపడం లేదు.   సిటీలో ఇంటి రెంటల్ పై  ఇన్ కం పొందేవారు ప్రధానంగా భయపడుతున్నారు.  విద్యానగర్​ ఏరియాలో అపార్ట్ మెంట్​ఉన్న ఓనర్​ ఆధార్​ లింకేజీకి ఇంట్రెస్ట్​చూపలేదని వాటర్​బోర్డు అధికారి చెప్పాడు.

ఒక్క ప్లాటుకే వర్తింపు?

ఇప్పటివరకు ఉన్న రూల్స్​ప్రకారం ఆధార్ వివరాలను వాటర్ బోర్డు డేటాలో ఎంటర్​చేయగానే, ఓనర్​కు ఎన్ని ప్రాపర్టీలతో ఆధార్ సీడింగ్ జరిగిందనే విషయం తెలిసిపోతుంది. ఒక్కసారి ఆధార్ నెంబర్ కొట్టగానే, దానిపై ఉన్న ఆస్తుల వివరాలు తెలిసిపోతాయి. ఒకటి కంటే ఎక్కువ ప్లాట్లు ఉంటే ఫ్రీ వాటర్ స్కీమ్​ వర్తించదని వాటర్​బోర్డు కూడా స్పష్టం చేసింది. అన్ని ప్రాపర్టీలకు స్కీం వర్తిస్తుందని ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఓనర్లు ఆధార్ వివరాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.

సుప్రీం కోర్టు తీర్పును చూస్తే..

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ వివరాల సేకరణపై 2017లో సుప్రీం కోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. దీని ప్రకారం చూస్తే.. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ఆధార్ మస్ట్​కాదు. ప్రభుత్వం కూడా వివరాలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ ఆదేశాలిచ్చింది.  అయితే  ఫ్రీ వాటర్ స్కీం కోసం ఆధార్ సీడింగ్ చేస్తేనే జీరో బిల్లు స్కీం వర్తించదని ఎలా చెబుతున్నారన్నది చర్చగా మారింది. ఆధార్ సీడింగ్ ప్రక్రియకు మరో నెల రోజులు మాత్రమే గడువు ఉంది.

ఓనర్లపై ఒత్తిడి తేవొద్దు

సంక్షేమ పథకాలకు ఆధార్ వివరాలు నమోదు చేయడానికి వీల్లేదు. సిటీలో ఫ్రీ వాటర్ స్కీమ్ అంశానికి కూడా ఇది వర్తిస్తుంది. ఈ క్రమంలో  ఆధార్ వివరాలు సేకరిస్తే లీగల్ ప్రాబ్లమ్స్​వస్తాయి.  సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించినట్లు అవుతుంది. వాటర్​బోర్డు ఓనర్లపై ఒత్తిడి చేయొద్దు.

– సుంకరి జనార్దన్ గౌడ్, హైకోర్టు అడ్వకేట్