కరోనా ట్రీట్మెంట్ కోసం అటువైపు చూడని జనం
ప్రైవేటు హాస్పిటళ్లలో బెడ్లు ఫుల్.. కొన్నిట్లో వెయిటింగ్ లిస్ట్లు
గాంధీ హాస్పిటల్ కు వెళ్లడానికీ జంకుతున్న పేషెంట్లు
లక్షలు అప్పు చేసైనా ప్రైవేటులో చేరేందుకే మొగ్గు
ప్రభుత్వ దవాఖాన్లలో ట్రీట్మెంట్ను పట్టించుకోని సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు దవాఖాన్లపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతున్నది. కరోనా తీవ్రత.. రోజురోజుకు పెరుగుతున్నకేసులు.. అక్కడ అందుతున్న ట్రీట్మెంట్ తీరు.. దడపుట్టిస్తున్నది. గాంధీహాస్పిటల్లో వెయ్యికిపైగా బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఆరోగ్య శాఖ రోజూ ప్రకటిస్తున్నా.. అందులో చేరుతున్న వారి సంఖ్య వందమందికి మించటంలేదు. ప్రైవేటు హాస్పిటళ్లు అడ్డగోలుగా బిల్లులు వసూలు చేస్తున్నాయనే ప్రచారం జరుగుతున్నా.. గవర్నమెంట్ హాస్పిటళ్లపై నమ్మకం లేక అప్పో సొప్పో చేసైనా సరే ప్రైవేటు హాస్పిటల్లో చేరేందుకే కరోనా పేషెంట్లు మొగ్గుచూపుతున్నారు. బెడ్లులేవన్నా సరే.. మినిస్టర్లు, ఎమ్మెల్యేలతో రికమండేషన్ చేయించుకొని, లక్షలు కుమ్మరిస్తున్నారు.
ఇటంటే అటు.. అటంటే ఇటు..
కరోనా పేషెంట్లకు కేరాఫ్ గా గాంధీ హాస్పిటల్ ను చేసినట్టుగానే, కరోనా అనుమానితులకు కేరాఫ్‌గా కింగ్‌కోఠి దవాఖానను మార్చారు. కరోనా అనుమానితులంతా కింగ్ కోఠికే రావాలని ప్రచారం చేశారు. తీరా అక్కడికెళ్తే గాంధీకి పోవాలంటూ.. గాంధీకి పోతే ఉస్మానియా హాస్పిటల్‌కో, చెస్ట్ హాస్పిటల్‌కో పోవాలంటూ పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా దవాఖాన్ల నడుమ తిరుగుతూనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవే కారణాలతో ఏప్రిల్‌లోనే ఇద్దరు వృద్ధులు రోడ్డుపై ప్రాణాలొదిలారు. ఇటీవల సత్తెమ్మ అనే మహిళ కింగ్ కోఠి గేట్ దగ్గరే ప్రాణాలు వదిలింది. చెస్ట్ హాస్పిటల్‌లో రవికుమార్ అనే వ్యక్తి ‘‘నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఆక్సిజన్ కూడా తీసేశారు. చనిపోతున్నాను డాడీ’’ అంటూ
పెట్టిన వీడియో అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటన తర్వాత కూడా ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. అయినా సర్కార్ తీరు మారలేదు. హెల్త్ స్టాఫ్, దవాఖాన్ల నడుమ కోఆర్డినేర్డిషన్ లేకపోవడంతో పేషెంట్లు హాస్పిటళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
గాంధీలో సౌకర్యాలు లేక..
గాంధీ హాస్పిటల్లో పది ఇరవై మందికి ఒకటే బాత్రూం ఇవ్వడం, ఫుడ్ సరిగా పెట్టకపోవడం, అనుమానితులందరినీ ఒకే గదిలో ఉంచడం, టెస్ట్ శాంపిల్స్ మిస్ అవ్వడం, ఏకంగా మృతదేహాలు గల్లంతవటం వంటి అనేక ఘటనలు బయటకొచ్చాయి. గాంధీ హాస్పిటల్లో పెట్టే ఫుడ్ పశువులు కూడా తినలేవంటూ 17 మంది పేషెంట్లు ఏకంగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ విషయాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. ‘‘గాంధీ హాస్పిటల్‌కు వెళ్లడం కన్నా జైలుకెళ్లడం మంచిది. గాంధీ హాస్పిటల్లో తిండి సరిగా లేదు. బాత్రూంలు నీట్‌గా ఉండవు’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విమర్శలపై సర్కార్ ఎదురుదాడికి దిగిందే తప్ప లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో తప్పు మీద తప్పు జరిగిపోయింది. కరోనాతో గాంధీ హాస్పిటల్ కు వెళ్లిన ఓ వ్యక్తి సుమారు 20 రోజుల తర్వాత మార్చురీలో శవంగా తేలాడు. మధుసూదన్ అనే వ్యక్తి విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆయన చనిపోయాడని ఓసారి, బతికున్నాడని మరోసారి చెప్పి, చివరకు కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండానే అంత్యక్రియలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గాంధీ హాస్పిటల్లో చేరిన 24 గంటల వరకూ జర్నలిస్ట్ మనోజ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. ఆయన మరణ వార్త నేషనల్ లెవల్లో సంచలనంగా మారింది. మరో ఘటనలో ఒకరి శవాన్ని, ఇంకొకరి కుటుంబానికి అప్పగించారు. ఇలా అనేక ఘటనలు గాంధీ హాస్పిటల్ పై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.
డాక్టర్లు, స్టాఫ్ కొరత
పేషెంట్ల దగ్గరికి డాక్టర్లు రాకపోవడం, నర్సులు, అటెండర్లు అందుబాటులో ఉండకపోవడం, వార్డుల్లో చెత్త పేరుకుపోవడం వంటి వీడియోలు కూడా గాంధీ హాస్పిటల్ నుంచి బయటకొచ్చాయి. దవాఖానలో సరిపడా స్టాఫ్ లేకపోవడమే ఈ తప్పులకు ప్రధాన కారణమని డాక్టర్లు అంటున్నారు. 4 కోట్లమందికి ఒకటే దవాఖానా అంటూ రోడ్డు ఎక్కి ఆందోళన కూడా చేశారు. గాంధీ హాస్పిటల్లో ఇప్పటికీ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వందల్లో ఖాళీగా ఉన్నాయి. జూనియర్ డాక్టర్లను పెట్టి మేనేజ్ చేస్తున్నారు. నలుగురు నర్సులు పనిచేయాల్సిన చోట ఒక్కరితోనే మేనేజ్ చేస్తున్నారు. 4 రోజుల కింద 150 మంది నర్సులను చేర్చుకునేందుకు ప్రయత్నించినా.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కావడంతో ఒక్కరు కూడా
జాయిన్ అవ్వలేదు. ఈ కొరతతో ఐసీయూలో ఉన్నపేషెంట్లకు టైమ్‌కు ఫుడ్ కూడా అందడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఫుడ్ తినిపించాలని పేషెంట్లు తమను అడుగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గాంధీ హాస్పిటల్లో సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్ వంటి వన్నీ ఔట్ సోర్సింగ్ కంపెనీలకు అప్పగించారు. వాళ్లు ఇచ్చే 8, 10 వేల జీతానికి లైఫ్ రిస్క్ చేయడమెందుకని చాలా మంది డ్యూటీకి రావడం లేదు. దీంతో మరిన్ని ఇబ్బందులొస్తున్నాయి. ఒక్క గాంధీలోనే కాదు.. మిగిలిన సర్కారు దవాఖాన్లలోనూ డాక్టర్లు, సిబ్బంది కొరత విపరీతంగా ఉంది.
గాంధీ హాస్పిటల్ వైపు చూడని సర్కార్ పెద్దలు
సర్కారు దవాఖాన్లలో పరిస్థితిపై లెక్కలేనన్ని ఘటనలు వెలుగులోకి వచ్చినా.. ప్రభుత్వం మాత్రం వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రజలకు నమ్మకం కలిగించే చర్యలు చేపట్టడంలేదు. గాంధీ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయిలో ట్రీట్మెంట్ ఉంటుందని ప్రభుత్వ పెద్దలు, వీఐపీలు అంటూనే.. తమకు కరోనా వస్తే మాత్రం కార్పొరేట్ దవాఖాన్లలో చేరుతున్నారు. కరోనా పేషెంట్లెవరైనా గాంధీ హాస్పిటల్ కే రావాలంటూ ప్రకటనలు చేసిన మంత్రి, ముఖ్యమంత్రి మాత్రం తమ నేతల్లో ఎవరికైనా కరోనా సోకితే గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలనే సాహసం చేయలేదు. తమ అనుచరులకు కరోనా వచ్చినా రికమెండ్ చేసి కార్పొరేట్ హాస్పిటల్స్లో చేరిపిస్తున్నారు తప్ప, ప్రభుత్వ దవాఖానకు పొమ్మని చెప్పడం లేదు. ఒకరిద్దరు నేతలు గాంధీలో చేరినా తర్వాత వేరే హాస్పిటల్‌కు షిఫ్ట్అయ్యారు. టీఆర్‌ఎస్ నాయకుడు, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ దేవర మల్లప్ప తొలుత గాంధీలోనే అడ్మిట్ అయ్యారు. అక్కడ పట్టించుకునేవారు లేరంటూ రెండ్రోజులకే అపోలోకు షిఫ్ట్ అయ్యారు. ఇలా చాలా మంది పేషెంట్లు గాంధీ, ఇతర సర్కార్ ఆస్పత్రుల నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయారు.
ఎందుకు పోవట్లే?
సర్కార్ దవాఖాన్లలో బెడ్లు ఖాళీగా ఉన్నావాటిలో పేషెంట్లు అడ్మిట్ కావడంలేదు. సరిపోయేంత స్టాఫ్ లేకపోవడం, సరైన ఎక్విప్ మెంట్స్ లేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. గాంధీ హాస్పిటల్లో ఇటీవల వెలుగుచూసిన ఘటనలు మరింత కలకలం సృష్టిస్తున్నాయి. అక్కడ పది ఇరవై మందికి ఒకటే బాత్రూం ఉండటం, తిండి సరిగా పెట్టకపోవడం, డెడ్ బాడీలు గల్లంతవటం వంటి ఘటనలు బయటపడ్డాయి. వీటికి తోడు.. కార్పొరేట్ స్థాయిలో గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు చెప్తున్న ప్రభుత్వ పెద్దలు కూడా తమకు కరోనా సోకితే ప్రైవేట్ నే ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో సర్కార్ దవాఖాన్లకు పోవాలంటే జనం భయపడుతున్నారు.
For More News..