ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ విద్య, వైద్యం కొన ఊపిరితో ఉన్నది. పాఠశాలల్లో స్కాలర్ షిప్, టిఫిన్స్, మధ్యాహ్ననం భోజనం కాదు కావాల్సింది, అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన ప్రభుత్వ విద్య కావాలి. వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లాంటి స్కీమ్ లు కాదు కావాల్సింది, కార్పొరేట్ స్థాయిలో మెరుగైన ప్రభుత్వ వైద్యం కావాలి. విద్య వైద్యాన్ని జాతీయం చేసి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించాలి. విద్య, వైద్యం వ్యాపార వస్తువుగా మారడంతో ప్రజలు దోపిడీకి గురి అవుతున్నారు. దీనివల్ల ఒక కుటుంబం సంవత్సరానికి కనీసం 2 లక్షల నుండి 3 లక్షల వరకు ఖర్చు చేస్తుంది.
‘డబ్బు లేని ఇల్లు ఉంటుంది కానీ.. జబ్బు లేని ఇల్లు ఉండదు’
పేదలకు తప్ప సంపన్నులకు, పాలకులకు పనికి రాని ప్రభుత్వ వైద్యం నిర్లక్ష్యానికి గురైంది. ప్రతి వెయ్యి మందికి ఒక ప్రభుత్వ డాక్టర్ ఉండాలి. కానీ తెలంగాణలో 8 వేల మందికి ఒక ప్రభుత్వ డాక్టర్ ఉన్నారు. కనీసం 37 వేల మంది డాక్టర్స్ ఉండాలి కానీ నాలుగు వేల ఏడు వందల మంది మాత్రమే ఉన్నారు. పెరుగుతున్న ప్రజల అవసరాలకు తగ్గట్టుగా దవాఖానాలను పెంచాలి. పెంచక పోగా ఉన్న దవాఖానల్లో అరకొర వసతులు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని దవాఖానల్లో 20 వేల మంది నర్సులు ఉండాల్సిన చోట 5 వేలమంది నర్సులు మాత్రమే ఉన్నారు. మొత్తం దవాఖానల్లో 30 వేల బెడ్లు ఉంటాయి. గాంధీ హాస్పిటల్ లో 2000 బెడ్లు ఉన్నాయి. కనీసం 1000 మంది నర్సులు ఉండాలి. కానీ 350 మంది నర్సులు మాత్రమే ఉన్నారు. ఒక డాక్టర్ రోజుకు ఓపి లో సుమారు 100 నుంచి 200 మంది పేషెంట్లను చూస్తున్నారు.
వైద్యానికి 5శాతం బడ్జెట్టా?
ఉన్న ప్రభుత్వ దవాఖానల్లో ప్యాకల్టీని పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. పారామెడికల్, స్టాప్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, పార్మసిస్ట్, పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి.ల్యాబ్ టెక్నీషియన్ లు లేకపోవడంతో పెద్ద యంత్రాలు పడావుబడి ఉన్నాయి. వైద్యుల ఇతర ఉద్యోగుల నిర్లక్ష్యం, అన్ని రకాల మందుల కొరత, శుభ్రత పాటించక పోవడం సర్వ సాధారణమై పోయింది. 2022–-23 బడ్జెట్ లో ప్రభుత్వ వైద్యానికి కేవలం 5 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. కనీసం దాన్ని 20శాతానికి పెంచాలి. ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం లేకనే ప్రజలు ఉన్నది అమ్ముకునైనా ప్రవేట్ దవాఖానలకు పోయి నిలువు దోపిడీకి గురి అవుతున్నారు. పాలకులు మాత్రం ప్రభుత్వ సొమ్ముతో వారికి అనారోగ్యం కలిగినప్పుడు ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం పొందుతున్నారు.
అన్ని దవాఖానలను పెంచాలి
2 ప్రభుత్వ కంటి దవాఖానలు, 4 ప్రసూతి ఆస్పత్రులు, 1 పిల్లల ఆస్పత్రి, 2 ఛాతీ ఆస్పత్రులు, 4 ఆయుర్వేద ఆస్పత్రులు, 3 యునాని ఆస్పత్రులు, 3 హోమియోపతి ఆస్పత్రులు, 1 నేచురోపతి ఆస్పత్రి (యోగ )మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య పెంచాలి. అట్లాగే ప్రభుత్వ ఫార్మసీలు1 ఆయుర్వేద,1యునాని,1 హోమియోపతి మాత్రమే ఉన్నాయి. అల్లోపతి పార్మ సీ లేదు.
మాఫియా చేతిలో వైద్యం
ప్రైవేట్ దవాఖానలో లక్షలు ఖర్చు పెట్టందే వైద్యం దొరకడం లేదు. కన్సల్టింగ్ ఫీజు నుంచి మొదలవుతుంది దోపిడీ. వెంటనే టెస్టులు రాస్తారు. ఉదా:- సిటీ స్కాన్ రాస్తే డయాగ్నటిక్ సెంటర్ వారు పది వేలు అయితే నాలుగు వేలు నేరుగా డాక్టర్ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఏ రక్త పరీక్ష రాసినా 40% డాక్టర్స్ కు మామూలు ఉంటుంది. ఇక మందుల కంపెనీలు డాక్టర్స్ కు వారి కంపెనీల మందులు రాస్తే 40% నుంచి 50% ఇస్తారు. కొన్నిటిలో 200%మార్జిన్ కూడా ఉంటది. విదేశీ టూర్లు ఉంటాయి. ఐడీపీఎల్ కంపెనీ మూత పడేలా చేసి ఫార్ములాలు తస్కరించి ప్రైవేట్ ఫార్మా కంపెనీలు పెట్టుకున్న వారు ఉన్నారు.
‘
విద్య అనగా మానవునిలో దాగివున్న అంతర - జ్ఞానాన్ని వెలికి తీయడం’
ప్రాథమిక హక్కు ల్లో విద్య కూడా ఒకటి. తెలంగాణలో ఇప్పటికీ అక్షరాస్యత 74 శాతం దాట లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ లేకపోవడం, విద్యార్థుల సంఖ్యకు సరిపోను ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలను స్థాపించడంలో ప్రభుత్వాలు విఫలమైనాయి. కార్పొరేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతో తెలంగాణలో వేల కోట్ల విద్యా వ్యాపారం జరుగుతుంది. ఇది ఒక మాఫియాగా మారి ప్రభుత్వ అధికారులను, రాజకీయ పార్టీలను ముఖ్యంగా అధికార పార్టీని శాసిస్తుంది. విద్యా శాఖ అధికారులకు రాజకీయ నాయకులకు కలిపి వందల కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో ముడుతున్నాయి.
అధికారుల అవినీతి
ప్రైవేట్ స్కూల్స్ ను కాలేజీలను విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయరు. చాలా విద్యా సంస్థలకు పర్మిషన్ లు వుండవు. ఉన్నా.. వాటిలో పర్మిషన్ ఇవ్వడానికి కావాల్సిన సదుపాయాలు వుండవు. ఇక కొంతమంది అధికారులు డెప్టుటేషన్ పద్ధతిన విద్యాశాఖ ఆఫీస్ ల్లో తిష్టవేసి ఒక పద్దతి ప్రకారం కేవలం ప్రభుత్వ స్కూల్ లను భ్రష్టు పట్టిస్తున్నారు. పాఠశాలల్లో తలా తోక లేని విధానాలను అమలు చేసి టీచర్స్ స్వేచ్ఛను హరిస్తున్నారు. ప్రస్తుతం టీచర్లు రోజు పాఠశాలకు వెళ్లి పాఠాలు బోధించడానికి బదులు కంప్యూటర్ ఆపరేటర్ , అటెండర్ డ్యూటీలు చేయాల్సివస్తుంది.
ప్రభుత్వ బడులు తగ్గి, కార్పొరేట్ బడులు పెరిగాయి
2014 తరువాత ప్రభుత్వ స్కూల్స్ తగ్గి, ప్రైవేట్ స్కూల్స్ పెరగటం జరిగింది. తెలంగాణలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 41,369, విద్యార్థులు 62,28,665. జూనియర్ కాలేజీలు 2,963, విద్యార్థులు 9,48,321. ఇందులో 420 మాత్రమే ప్రభుత్వానివి. మిగతా 2543 ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలే. డిగ్రీ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీల్లోనూ సింహ భాగానికి మించి కార్పొరేట్ కాలేజీలేనని గమనించాలి.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
విద్య పైన రాష్ట్ర ప్రభుత్వం 2022-–23 కు గాను 7.6 శాతం నిధులు కేటాయించింది. దీనిని కూడా 20 శాతానికి పెంచితే తప్ప కొంతమేరకు ప్రభుత్వ విద్య బాగుపడదు. రెసిడెన్షియల్ పాఠశాలలు 1002 ఉన్నాయి. వీటినీ పెంచాలి. ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల ఉపాధ్యాయ పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు 24,000 ఖాళీలు ఉన్నాయి. ప్రతీ స్కూలుకి ఒక స్కేవెంజర్, స్వీపర్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ స్కూల్స్‌లో బాతు రూంలు సరిపడ వుండవు. ల్యాబ్ లు, లైబ్రరీలు లేవు. రెగ్యులర్ ఎమ్ఈఓ లు 10 శాతం కూడా లేరు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల సంఖ్య గణనీయంగా పెంచాలి.
విద్య వైద్యాన్ని జాతీయం చేయాలి
2014 తర్వాత ఫీజు రియింబర్స్‌మెంట్ స్కీం అటకెక్కింది. ఇది పరోక్షంగా ప్రైవేట్ కాలేజీలు ఇష్టారీతిన ఫీజులు పెంచుకోవడానికి దారి తీసింది. దీనితో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గం ఉన్నత చదువులకు దూరమైపోయింది. బడ్జెట్ లో విద్య, వైద్యానికి 40 శాతం నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తూ క్రమేణా విద్య వైద్యాన్ని జాతీయం చేసి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రతి ఒక్కరికి అందించాలి. అప్పుడు మాత్రమే ఇటురాష్ట్రాలు, అటు దేశం అభివృద్ధి చెందుతుంది
జనరిక్ మెడిసన్ అభివృద్ధి పర్చాలి
ఐడీపీఎల్ లాంటి కంపెనీలను పునః ప్రారంభించి పటిష్ట పర్చి, జనరిక్ మెడిసిన్ అభివృద్ధి పర్చాలి. ప్రస్తుతానికి బ్రాండెడ్ జనరిక్ మెడిసిన్ ఎమ్మార్పీ రేట్లను తగ్గిస్తే పేషెంట్స్ కు లాభం జరుగుతుంది. ప్రైవేట్ ఫార్మాసిటికల్ కంపెనీలు పేర్కొన్నట్లు టాబ్లెట్ లలో, ఇంజక్షన్ లలో మెడిసిన్ ఉండదు. అన్ లిమిటెడ్ ఎమ్మార్పీ కూడా ఉంటుంది. ప్రైవేటు దవాఖానల, ప్రైవేట్ ఫార్మసీ కంపెనీల యజమానులు వేల కోట్లకు పడగెత్తారు. మాఫియా చెర నుండి వైద్యాన్ని విముక్తి చేయాలంటే ప్రభుత్వ ఆస్పత్రులను పెంచి తగిన ఫ్యాకల్టీ ఏర్పాటు చేయాలి. ఐడీపీఎల్ లాంటి ప్రభుత్వ ఫార్మా కంపెనీలను స్థాపించాలి. ముక్కు మూసుకుంటే తప్ప ప్రభుత్వ ఆస్పత్రులలో అడుగు పెట్టలేని పరిస్థితి మారాలి. శుభ్రత పాటించాలి.
- నారగోని ప్రవీణ్ కుమార్, ఉచిత విద్య వైద్య సాధన సమితి