- ఆదిలాబాద్లో ట్రాఫిక్ కష్టాలు.. పట్టని ఆఫీసర్లు
- మున్సిపల్, పోలీసు శాఖల మధ్య సమన్వయ లోపం
- ఇబ్బంది పడుతున్న జనం.
ఆదిలాబాద్,వెలుగు: కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసిన్రు.. డివైడర్లు కట్టిన్రు.. సెంట్రల్ లైటింగ్స్ ఏర్పాటు చేసిన్రు.. ఏంలాభం జనానికి మాత్రం ట్రాఫిక్కష్టాలు తప్పడంలేదు. ఇటీవల దాదాపు రూ. 80 కోట్లతో పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధాన కూడళ్లు, చౌక్ లలో రోడ్డు, మధ్యలో పెద్ద పెద్ద డివైడర్లు కట్టారు. పట్టణ జనాభా రోజురోజుకు పెరుగుతోంది. అంతే వేగంగా వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. వ్యాపారులు, మార్కెట్ వచ్చే వారు ఎక్కడ పడితే అక్కడే వాహనాలను పార్కింగ్చేస్తున్నారు. కొన్నిచోట్ల వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా లారీల్లో వచ్చిన సరుకును లోడింగ్ అన్ లోడింగ్ చేస్తూ రోడ్లను బ్లాక్చేస్తున్నారు. బల్దియా ఆధ్వర్యంలో చిరువ్యాపారుల కోసం కట్టిన షాపులు కొందరికే కేటాయించారు. ఒక్కొక్కరికి రెండుమూడు షాపులు కేటాయిచడంతో మిగతావారంతా రోడ్లపైనే వ్యాపారం చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. పట్టణ జనాభా సుమారు 1.50 లక్షలు ఉంటుంది. నిత్యం 10 వేలకు పైగానే వెహికల్స్అటూఇటూ తిరుగుతుంటాయి. డివైడర్ల కారణంగా రోడ్లు వెడల్పు తగ్గింది. దీంతో వెహికల్స్ పోవడానికి... రావడానికి కష్టంగా మారింది. దీంతో జనం కనీసం అడుగుతీసి అడుగు వేయలేక ఇబ్బంది పడుతున్నారు.
మా ఇష్టం.. మేమింతే..
పట్టణం పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. అశోక్ రోడ్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, తాంసి బస్టాండ్ నేతాజీ చౌక్ ప్రధాన మార్కెట్ ప్రాంతాలు ఉదయం 8 గంటలు దాటిందంటే చాలు రద్దీగా మారుతున్నాయి. ఫుట్ పాత్లు లేకపోవడంతో జనం ఇబ్బందులుపడుతున్నారు. వ్యాపారులు పార్కింగ్, సెల్లార్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో దుకాణాలకు వచ్చిపోయేవారు రోడ్లపై వెహికల్స్పార్కింగ్చేస్తున్నారు.
పట్టించుకోని బల్దియా..
ట్రాఫిక్ సమస్య పరిష్కరించడంలో బల్దియా, పోలీసు శాఖ ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. మున్సిపల్ అధికారులు రోడ్లపై చిరువ్యాపారాలు తొలగించడం లేదు. ట్రాఫిక్ పోలీసుల నుంచి వినతులు వెళ్లినా పట్టించుకోవడం లేదు. పట్టణ ట్రాఫిక్ సమస్యపై మున్సిపల్ కమిషనర్ ను ఫోన్ ద్వారా సంప్రదిస్తే... స్పందించలేదు.
ఇబ్బందులు పడుతున్నాం...
అంబేద్కర్ చౌక్ నుంచి శివాజీ చౌక్, గాంధీ చౌక్ వరకు రోడ్లపై తోపుడు బండ్లు పెడుతున్నారు. టూవీలర్స్పార్క్చేస్తున్నారు. పండుగలు, ఇతర సందర్భాల్లో మార్కెట్ కు వెళ్లాలంటే కష్టంగా మారింది. ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. ఆఫీసర్లు స్పందించి చర్యలు తీసుకోవాలి.
- రవి, ఆదిలాబాద్
ఇబ్బంది లేకుండా చూస్తున్నాం...
ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం. రోడ్లపై చిరు వ్యాపారాలు చేస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. సమస్యను మున్సిపల్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాం. ఎక్కడపడితే అక్కడ పార్కింగ్చేయొద్దని షాపుల యజమానులకు హెచ్చరించాం.
- మల్లేశ్, ట్రాఫిక్ సీఐ