- గ్రేటర్లో వేధిస్తున్న ఆర్టీసీ బస్సుల కొరత
- మే నెల నాటికి 500 బస్సులు కొంటామన్న అధికారులు
- నేటికీ అందుబాటులోకి రాని కొత్త బస్సులు
- ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 2,800 బస్సులు
- వీటిలో సగానికి పైగా పాతవే.. తరుచూ రిపేర్లు
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సుల కొరత వేధిస్తోంది. టైంకు బస్సు రాక, వచ్చిన బస్సులో సీటు దొరకక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మే నాటికి 500 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని ఆర్టీసీ అధికారులు గతంలో ప్రకటించారు. అయితే నేటికీ కొత్త బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాలేదు. ఉన్న బస్సులతోనే అధికారులు నెట్టుకొస్తున్నారు.
ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నామని, హాలిడేస్, పండుగల సమయంలో స్పెషల్సర్వీసులను తిప్పుతున్నామని ప్రకటిస్తున్నారే తప్ప.. అమలులో కొన్నే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చాక ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందుకు తగినట్టుగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాయాల్సి వస్తోంది.
కొత్త బస్సులు ఇంకెప్పుడు?
సిటీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పెరిగిన ఆక్యుపెన్సీ రేషియోకు అనుగుణంగా గ్రేటర్పరిధిలో 500 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గతంలో అధికారులు ప్రకటించారు. దీంతో బస్సుల కొరత తీరుతుందని అంతా ఆశించారు. కానీ సిటీలో ఎక్కడా కొత్త బస్సు కనిపిస్తలేదు. ప్రయాణికులకు పాత బస్సులే దిక్కయ్యాయి.
నెల నెలా 10 నుంచి 15 బస్సులు కాలం తీరిపోతున్నాయి. పాత వాటికి తరచూ రిపేర్లు వస్తున్నాయి. దీంతో కొన్నిసార్లు రోడ్ల మీదనే బస్సులు ఆగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 9,100 బస్సలు ఉండగా, ఇందులో 2,700 హైర్ చేసుకున్నవి. 2,800 బస్సులను గ్రేటర్ పరిధిలో తిప్పుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో సగానికిపైగా పాత బస్సులే. వీటిని మెయింటెనెన్స్ చేయలేక అధికారులు.. నడపలేక డ్రైవర్లు తిప్పలు పడుతున్నారు.
ఎలక్ట్రికల్ బస్సులు సమకూర్చలే
ఆరు నెలల కింద 1000 ఎలక్ట్రికల్బస్సులను అద్దెకు తీసుకుంటున్నట్లు టీజీ ఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆ వెంటనే విజయవాడ–హైదరాబాద్ మధ్య 15, శంషాబాద్ఎయిర్పోర్టుకు 20 ప్రారంభించారు. మిగిలిన బస్సులను జిల్లాలకు వినియోగిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకూ ప్రకటించిన మేరకు బస్సులు సమకూర్చలేదు. ఎలక్ట్రికల్బస్సుల కోసం ఆయా ప్రాంతాల్లో చార్జింగ్సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.
అదీ చేయలేదు. మే నెలలో 25 గ్రీన్మెట్రో నాన్ ఏసీ బస్సులను మాత్రమే ప్రవేశ పెట్టగలిగారు. అయితే 2023-24 నుంచి 2024-25 మధ్య దశల వారీగా 1,050 ఈ- బస్సులను కూడా అందుబాటులోకి తీసుకు రావాలని ఆర్టీసీ ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.