![ఎమ్మెల్యే మనిషినంటూ బెదిరింపులు.. తిరగబడ్డ జనం](https://static.v6velugu.com/uploads/2019/08/mla-1.jpg)
కుత్బుల్లాపూర్ బాలయ్య నగర్లో లొల్లి
ప్లాట్లు తనవేనంటూ అనుచరులతో కలిసి హల్‌చల్
తిరగబడిన స్థానికులపై ఫిరోజఖాన్ దాడి
సోషల్ మీడియాలో వీడియో వైరల్
హైదరాబాద్, వెలుగు: ‘నేనెవరో తెలుసా? వార్డు మెంబర్‌ని. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అనుచరుడినని. ఈ ప్లాట్లు నావి’ అంటూ బెదిరించాడో వ్యక్తి. ఇండ్లకు తాళం వేసి జాగా తనదేనన్నాడు. అడ్డువచ్చిన ఆడవారిపై అనుచరులతో కలిసి చేయిచేసుకున్నాడు. దీంతో స్థానికులు తిరగబడ్డారు. దీంతో బూతులు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడా నాయకుడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్, ఫేస్ బుక్ ల్లో హల్‌చల్ చేస్తోంది.
ఇదీ కథ…
హైదరాబాద్‌లోని సూరారం కాలనీకి చెందిన ఫిరోజ్ ఖాన్.. జీహెచ్ఎంసీ వార్డు మెంబర్ అని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందకు ప్రధాన అనుచరుడినని చెబుతుంటాడు. బాలయ్యనగర్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఉన్న రెండు ప్లాట్లలో రెండు కుటుంబాల వాళ్లు రూమ్‌లు కట్టుకుని ఉంటున్నారు. కొన్ని రోజుల కిందట ఫిరోజ్ అక్కడికి వెళ్లి ఆ ఇళ్లకు తాళం వేసి
ఈ జాగా తనదే అని మాట్లాడాడు. ‘నాకు బస్తీ లీడర్ ఎప్పుడో అమ్మేశాడు. నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే మనిషిని’ అని హెచ్చరించాడు. ఎదురు తిరిగిన కొందరు ఆడవారిపై తన అనుచరులతో కలిసి చేయి చేసుకున్నాడు. దీంతో కాలనీవాసులంతా ఎదురుతిరిగారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఫిరోజ్‌ఖాన్. మొత్తం గొడవను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొద్దిసేపటికే అది వైరలైంది. కాలనీవాసులు ఫిరోజ్ ఖాన్, అతని అనుచరులపై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.