ఓరుగల్లు కోట భూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల అండతో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. పురావస్తు శాఖ, కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై జనం మండిపడుతున్నారు.
కాకతీయుల కీర్తి ప్రతిష్టలను దశదిశలా వ్యాపింప జేసిన అద్భుత నిర్మాణం వరంగల్ కోట. కాకతీయుల రాజధానిగా పేరుపొందిన ఖిలావరంగల్ కోట చుట్టూ కొత్త నిర్మాణాలపై నిషేధం అమలులో ఉంది. అయినా కోటకు ఆనుకొని ఫంక్షన్ హాళ్లు, ఫుడ్ కోర్టులు, భారీ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే కట్టడాలు వెలుస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై పురావస్తు శాఖ, గ్రేటర్ వరంగల్ మున్సి పల్ కమిషనర్ కు ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదని జనం మండిపడుతున్నారు.
ఒకప్పుడు కోటలో పెద్ద చెట్లు... పంట పోలాలు కనిపించేవి. ఇప్పుడు ప్లాట్లు,పంక్షన్ హాళ్లు, భవణాలు దర్శనమిస్తున్నాయి. వరంగల్ నగరానికి యునెస్కో అనుబంధ సంస్థ గుర్తింపు దక్కింది. ఇందులో ప్రధానంగా పాత్ర వరంగల్ కోటదే. కోట నిర్మాణం, పర్యాటకం, కళానైపుణ్యాన్ని ప్రపంచం గుర్తిస్తున్నా.. మన పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని జనం అంటున్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే చారిత్రక వరంగల్ కోటలో అక్రమ నిర్మాణాలు, అసాంఘిక కార్యకలాపాల జరుగుతున్నాయంటున్నారు.
అక్రమ నిర్మాణాల వెనుక ప్రజాప్రతినిధుల హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కబ్జాదారుల, ప్రజా ప్రతినిధులు, అధికారులు కుమ్మక్కయ్యారని విమర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొంతకాలం తర్వాత ఓరుగల్లు కాకతీయల కోట స్థలాలను పేపర్లలోనే చూడాల్సి వస్తదంటున్నారు. పురావస్తు శాఖ అధికారులు నోటీసులకే పరిమితం కాకుండా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని జనం వాపోతున్నారు.