నాలాల చుట్టూ రాజకీయాలు
గంట వానపడితే వరంగల్, కరీంనగర్ సిటీల్లోని వందల కాలనీల్లోకి నీళ్లు
ఇటీవలి వర్షాలకు అనేక పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల మునక
లీడర్లు చెబితే గుడ్డిగా పర్మిషన్ ఇస్తున్న ఆఫీసర్లు
నాలాల మీద, చెరువుల వెంట అక్రమ నిర్మాణాలు
ఆక్రమణల తొలగింపునకు ఆయా చోట్ల పొలిటికల్ బ్రేకులు
వరంగల్ లో 84మంది స్టే తెచ్చుకోవడంతో నిలిచిన పనులు
వెలుగు నెట్వర్క్: గంటపాటు గట్టివాన పడితే ఒక్క హైదరాబాదే కాదు, వరంగల్, కరీంనగర్ లాంటి సిటీలతో పాటు వివిధ పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. పట్టణాలన్నీ ఒక ప్రణాళిక ప్రకారం రూపుదిద్దుకోకపోవడం, చెరువు శిఖాల్లో, ఫీడర్, ఔటర్చానళ్లలో ఇండ్ల కు అనుమతులివ్వడం, వరద నీటి కెపాసిటీకి తగినట్లు నాలాలు లేకపోవడం, ఉన్నచోట ఆక్రమణలకు గురికావడం లాంటి కారణాల వల్ల వర్షాకాలంలో చాలా కాలనీలు వారాలకొద్దీ నీటిలో మునిగి ఉంటున్నాయి. ప్రతిసారీ పరామర్శలకు వచ్చే ప్రజాప్రతినిధులు నాలాలను డెవలప్ చేస్తామనీ, వాటిపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయిస్తామని హామీలు ఇవ్వడం, ఆ తర్వాత కూల్చివేతలకు వెళ్లే ఆఫీసర్లను అడ్డుకోవడం పరిపాటిగా మారింది. దీంతో ఏండ్లు గడుస్తున్నా పట్టణాల పరిస్థితి మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేసులేయించి స్టేలు తెప్పిస్తున్నరు..
నాలాలాపై ఆక్రమణలను తొలగిస్తామని తెర ముందు చెబుతున్న ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నేతలు తెర వెనుక ఆక్రమణదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ సిటీలో ఇటీవల జరిగిన తతంగమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గడిచిన రెండు నెలల్లో నగరాన్ని మూడు సార్లు ఫ్లడ్స్ ముంచెత్తాయి. ముఖ్యంగా హనుమకొండ నయీం నగర్, 100 ఫీట్ రోడ్, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, సమ్మయ్య నగర్, పోచమ్మ కుంట, వరంగల్ ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్, హంటర్ రోడ్ లాంటి ఏం తక్కువ 120 కాలనీలు జలమయమయ్యాయి. నాలాలు ఆక్రమణకు గురి కావడమే ఇందుకు ప్రధాన కారణమని ఆఫీసర్లు గుర్తించారు. కానీ లీడర్ల జోక్యం కారణంగా గతంలో తొలగింపు సాధ్యం కాలేదు. ఇటీవల వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈసారి పొలిటికల్ ప్రెజర్ ఉండదని, ఆక్రమణలన్నింటినీ తొలగించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఈమేరకు వరంగల్ ట్రై సిటీలో 384 నిర్మాణాలు నాలాలకు అడ్డుగా ఉన్నాయని ఆఫీసర్లు మార్కింగ్ చేయగా, తీరా ఇందులో 84 మంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో కూల్చివేత పనులకు బ్రేక్ పడింది. ఈ కేసుల వెనుక లీడర్లే ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనా దసరా లోగా ఆక్రమణలన్నీ కూల్చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పినా లక్ష్యం నెరవేరలేదు. ఈలోగా మరోసారి వచ్చిన వరదలు జనాన్ని ఆగం చేశాయి.
కరీంనగర్లో వెయ్యి ఇండ్లకు ఎఫెక్ట్..
వరంగల్ తర్వాత మరో పెద్ద సిటీ కరీంనగర్ నుంచి వరద నీరు వెళ్లేందుకు ప్రధానంగా రెండు వాటర్ డ్రైన్స్ ఉన్నాయి. ఈ రెండు మెయిన్ నాలాలతో పాటు చిన్నిచితకా నాలాల మీద వందల కొద్దీ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. లీడర్ల ప్రోద్బలంతో నాలాలను ఆక్రమించుకొని షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్‌హాళ్లు, హాస్పిటళ్లు వెలుస్తున్నా ఆఫీసర్లు కళ్లు మూసుకొని కూర్చున్నారు. దీనికి తోడు అంబేడ్కర్ స్టేడియం సమీపంలో ఆక్రమణల కారణంగా మెయిన్ నాలా పూర్తిగా డ్యామేజ్ అయింది. కానీ నేటి వరకు దానికి రిపేర్ చేసినవారే లేరు. ఇటీవలి వర్షాలకు మరో చోట కూలిపోయింది. నాలాల మీద నిర్మాణాలు చేపట్టిన వారికి లోకల్‌గా ఉన్న అధికారపార్టీ లీడర్ల అండదండలున్నాయి. గతంలో ఆఫీసర్లు కూల్చివేతలు ప్రారంభించినప్పుడు అడ్డుకొని వెనక్కి పంపిన ఘటనలే ఇందుకు నిదర్శనం. గతంలో ఓ రోజంతా కురిసిన వర్షానికి కరీంనగర్ మొత్తం నీట మునిగింది. తాజాగా వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలు వరదలతో అతలాకుతలం అవుతున్నా, ఇక్కడి లీడర్లు, ఆఫీసర్లు మాత్రం ఇంకా కళ్లు తెరవడం లేదు. నల్గొండ మున్పిపాలిటీలోని లెప్రసీ కాలనీ, ప్రకాశం బజార్లో నాలాలు ఆక్రమనకు గురవ్వడంతో ఆ నీరంతా ఇళ్లలోకి చేరుతోంది. నాలాలు లేకపోవడం వల్ల మోతీకుంట, వీటీకాలనీ, గంద వారీ గూడెంలో రూ.18 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ రోడ్ల వెడెల్సు చేయాలని నాలాలను పక్కనపెట్టడంతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు.
చెరువుల అలుగు కాలనీల్లోకే..
ఇటీవలి భారీ వర్షాల కారణంగా సూర్యాపేట, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, కల్వకుర్తి, జనగామ లాంటి అనేక పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు నానా కష్టాలు పడ్డారు. జనగామ పట్టణంలోని శ్రీ నగర్ కాలనీ మూడు నెలలుగా నీటిలోనే మునిగి ఉన్నా పట్టించుకున్నవారు లేరు. ఆగస్టు నెలలో భారీ వర్షాలకు తోడు పై నున్న రంగప్ప చెరువు మత్తడి దూకడంతో ఈ కాలనీలో కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల తరుచూ వానలు పడుతుండడంతో మత్తడికి బ్రేక్ పడడం లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం జరిగితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. కానీ ఆఫీసర్లెవరూ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. గట్టి వర్షాలు కొట్టినప్పుడల్లా జనగామ– హైదరాబాద్ హైవేపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో సమీపంలోని బాలాజీ నగర్, జ్యోతినగర్ కాలనీవాసులు ఇక్కట్లపాలవుతున్నారు. వనపర్తిలోనూ చిన్నపాటి వర్షానికే శ్వేతానగర్, బ్రహ్మంగారి వీధి, రామ్ నగర్, పాత వనపర్తి కాలనీలు నీటమునుగుతున్నాయి. పట్టణ సమీపంలోని తాళ్లచెరువు, నల్ల చెరువు కాలువలు ఆక్రమణకు గురికావడమే ఇందుకు ప్రధాన కారణం. ఇవి మత్తడి దూకినప్పుడల్లా ఆ నీరంతా కాలనీల్లో పారుతోంది. పొలిటికల్ లీడర్ల ఒత్తిళ్లతో ఎడా పెడా ఇండ్ల నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వడం వల్లే ఈ దుస్థితి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 200 ఇండ్ల వరకు అక్రమంగా ఉన్నాయని ఆఫీసర్లు తేల్చినా పొలిటికల్ ప్రెషర్ కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. కల్వకుర్తి పట్టణంలో ఏండ్ల క్రితం నిర్మించిన నాలాలు చిన్నగా ఉండడంతో ఇప్పటి అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో వర్షం కురిసినప్పుడల్లా గాంధీనగర్లాంటి కాలనీలు రోజుల తరబడి నీటిలో ఉండిపోతున్నాయి. రెవెన్యూ ఆఫీసర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమాల ఫలితంగా మెదక్‌లోని సాయినగర్ కాలనీ తరుచూ నీటమునుగుతోంది. ఈ ఏరియా మహబూబ్‌నహర్ కాలువను ఆనుకొని ఉండటం,నాలాలు లేకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ శివారులో కొత్తగా వెలసిన బృందావన్ కాలనీది సైతం ఇదే పరిస్థితి. రాయిన్‌పల్లి ప్రాజెక్ట్ నీటి కాలువ మెదక్ పట్టణంలోంచి ప్రవహిస్తుండడంతో వర్షాలు పడ్డప్పుడల్లా కాలువ నిండి, కాలనీలోకి ప్రవహిస్తోంది. సూర్యాపేటలో గతంలో 100ఫీట్ల వెడెల్పు ఉన్న నాలాను రోడ్ల అభివృద్ధి పేరుతో20ఫీట్లకు కుదించారు. దీంతో ఏటా వర్షాకాలంలో మానస నగర్, 60ఫీట్ల రోడ్, శ్రీనివాస కాలనీ, శ్రీ నగర్ కాలనీ, జాకీర్ హుస్సేన్ నగర్, చర్చ్ కాంపౌండ్ ఏరియా లు నీట మునుగుతున్నాయి. ముఖ్యంగా నాలాలను ఆక్రమించి వెలిసిన నిర్మాణాలను తొలగించడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వెనుక పొలిటికల్ ప్రెషర్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూడు నెలల నుంచి నీళ్లళ్లనే ఉంటున్నం ..
ఇటీవలి వానలు, సమీపంలోని రంగప్ప చెరువుకు వస్తున్న వరద కారణంగా మా కాలనీ నీటమునిగింది. ఆగస్టు నుంచి ఇప్పటిదాక కాలనీ ఇండ్లన్నీ నీళ్లళ్లనే ఉన్నయ్ . సీసీ రోడ్లు పాకురు పట్టినయ్. కనీసం నడువస్తలేదు. ముసలోళ్లు, చిన్న
పిల్లలు జారిపడుతున్నరు. గతంలో ఒకటి, రెండు రోజులే ప్రాబ్లమ్ ఉండేది. ఇప్పుడు మూడు నెలల నుంచి గోసపడుతున్నం. ఆఫీసర్లకు చెప్తే మేమేం జెయ్యాలె అంటున్నరు. ఉల్టా దబాయిస్తున్నరు. చెరువు మత్తడి పోసినన్ని రోజులు గట్లనే ఉంటదని చెబుతున్నరు. వానలు పడుతుండడంతో మత్తడి కంటిన్యూ అయితంది. ఆ నీళ్లు ఎప్పుడు ఆగుతయో.. మా బాధలు ఎప్పుడు తీరుతయో!
–కాసుల శ్రీనివాస్ , శ్రీ నగర్ కాలనీ, జనగామ
For More News..