హైదరాబాద్ విడిచి సొంతూళ్లకు బాట

కరోనా ఉధృతి, లాక్డౌన్ వార్తలతో ఊరిబాట
ఇప్పటికే 20 లక్షల మంది వెళ్లినట్లు అంచన

హైదరాబాద్, వెలుగు: బతుకు దెరువు కోసం హైదరాబాద్ కు వచ్చిన జనం.. సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. లాక్డౌన్ పెడతారన్న వార్తలతో ఎనిమిది రోజుల నుంచి భారీగా రిటర్న్ వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 20 లక్షల మంది హైదరాబాద్ను విడిచి వెళ్లిపోయినట్లు ఆఫీసర్లు అంచనాకు వచ్చారు. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్లోని అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదే టైంలో గత నెల 28న సీఎం కేసీఆర్.. ‘గ్రేటర్లో కనీసం 15 రోజులు లాక్డౌన్ పెట్టాలని హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. మూడునాలుగు రోజుల్లో కేబినెట్ ను సమావేశపరిచి తుది నిర్ణయం తీసుకుంటం” అని అన్నారు. ఈ వార్తలను చూసిన గ్రేటర్లోని జనం.. సొంతూళ్ల బాటపట్టారు. కుదిరితే సొంత వెహికల్స్ లో.. లేకపోతే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిపోతున్నారు. కొందరైతే ఇండ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ వలసలు లాక్ డౌన్ సడలింపుల తర్వాత కంటే
ఇప్పుడు ఎక్కువగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో అద్దెకు ఇండ్లు దొరకడం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఏ గల్లీలో చూసిన టులెట్ బోర్డులు కనిపిస్తున్నాయి.

లాక్డౌన్ పై గప్ చుప్
8 రోజుల కింద లాక్డౌన్ మాట చెప్పిన సర్కార్ ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. మళ్లీ లాక్ డౌన్ విధిస్తే హైదరాబాద్ ఇమేజీ దెబ్బతినే ప్రమాదం ఉందని, అందుకే లాక్ డౌన్ అంశం జోలికి సీఎం వెళ్లే అవకాశం లేదని ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. హైదరాబాద్లోనే రోజుకు వెయ్యికి దగ్గర్లో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఇప్పుడు లాక్ డౌన్ విధిస్తే వైరస్ కట్టడి చేయడంలో సర్కారు ఫెయిలైందనే సంకేతాలు వెళ్తాయనే భయం ప్రభుత్వ పెద్దలకు ఉందని ఓ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు.

మంత్రులది తలో మాట
లాక్డౌన్ అంశంపై కొందరు మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారు. లాక్ డౌన్ పరిష్కారం కాదని ఓ మంత్రి అంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉండటం కన్నా ఊళ్లలో ఉండటమే సేఫ్ అని జనం భావిస్తున్నట్లు మరో మంత్రి అన్నారు. దీంతో సిటీలో ఏదో జరుగుతుందనే గందరగోళం జనంలో మొదలైంది. కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదని, అవసరం ఉంటేనే బయటికి రావాలని, పాజిటివ్ వచ్చిన వాళ్లు చాలామంది కోలుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‘‘హైదరాబాద్ నుంచి ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు అంటే ప్రభుత్వం మీద నమ్మకం లేక కాదు. ఇరుకు గదుల్లో ఉండే కన్నా ఊళ్లో ప్రశాంతంగా ఉండొచ్చని. ఊళ్లో ఉపాధి అవకాశాలు పెరిగినయ్. ఈ టైంలో హైదరాబాద్ కంటే ఊరిలో ఉంటేనే బెటర్’’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అప్పారు. లాక్ డౌన్ విధిస్తే లాభం కంటే నష్టమే ఉంటుందని, సమస్యకు లాక్ డౌన్ పరిష్కారం కాదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ప్రకటించారు.

7 రోజులుగా ఫాం హౌస్‌లోనే సీఎం
లాక్ డౌన్ అంశంపై సీఎం కేసీఆర్ జూన్ 28న ప్రకటన చేశారు. ఆ రోజు రాత్రి ఆయన గజ్వేల్లోని ఫాం హౌస్‌కు వెళ్లారు. అప్పట్నించి హైదరాబాద్కు రావడం మానేసినట్లు తెలిసింది. ప్రగతిభవన్‌లో పనిచేసే స్టాఫ్లో చాలా మందికి పాజిటివ్ రావడం వల్లే ఆయన హైదరాబాద్‌కు రావట్లేదన్న ప్రచారం జరుగుతోంది.

For More News..

మావల్లే మీ భర్త చనిపోయాడు.. మమ్మల్ని క్షమించు!

కరోనాపై పోరులో తెలుగు రాష్ట్రాల మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్!

ప్రైవేటులో టెస్టులతో భారీగా బయటపడుతున్న కరోనా కేసులు