కరీంనగర్ నెట్ వర్క్, వెలుగు: ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమం గురువారం ఉమ్మడి కరీంనగర్జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు జనం భారీగా తరలివచ్చారు. ఉపాధి కోసం హైదరాబాద్‌తోపాటు, వేర్వేరుచోట్ల ఉంటున్నవారు స్కీముల కోసం స్వగ్రామాలకు చేరుకున్నారు. అధికారులు ఆరు గ్యారంటీలతోపాటు కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్లనూ తీసుకున్నారు.
అప్లికేషన్ ఫాంలు ఫ్రీగా పంపిణీ చేసినప్పటికీ.. చాలా చోట్ల జనం తాకిడికి సరిపోలేదు. దొరకని వాళ్లు రూ.20, రూ.30 చెల్లించి జిరాక్స్ సెంటర్ల వద్ద కొనుగోలు చేసి అప్లై చేసుకున్నారు. చొప్పదండి మండలం ఆర్నకొండ, చాకుంట, కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లిలోని సెంటర్లను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఎ.దేవసేన, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. అర్నకొండ గ్రామంలో సమ్మక్క అనే మహిళ తన భర్త మల్లయ్యకు దివ్యాంగుడి పెన్షన్ఇప్పించాలని కోరుతూ అప్లికేషన్ ఇచ్చేందుకు రాగా, నోడల్ ఆఫీసర్ దేవసేన స్వయంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ద్వారా సమ్మక్కకు రశీదును ఇప్పించారు.
కరీంనగర్ జిల్లాలోని 41 గ్రామ పంచాయతీల్లో గురువారం 16,127 అప్లికేషన్లు వచ్చాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 9,319, చొప్పదండి మున్సిపాలిటీ లో 402, జమ్మికుంటలో 1102, కొత్తపల్లిలో 204, హుజూరాబాద్ 1,298 అప్లికేషన్లు అందాయి. మున్సిపాలిటీల్లో వచ్చిన 12,325 అప్లికేషన్లతో కలిపి జిల్లా వ్యాప్తంగా మొదటిరోజు మొత్తం 28,452 దరఖాస్తులు అందాయని కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు.
గంగాధర మండలం బూరుగుపల్లి, చెర్లపల్లి(ఆర్) గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. హుజురాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ కె లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ రాజు పాల్గొన్నారు. కరీంనగర్33వ డివిజన్ పోలీస్ క్యార్టర్స్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్ రావు అప్లికేషన్లు తీసుకున్నారు.
సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో..
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 255 గ్రామాలకు గాను మొదటి రోజు 26 గ్రామాల్లో, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని 14 వార్డుల్లో ‘ప్రజాపాలన’ నిర్వహించారు. వేములవాడ మూడో వార్డులోని కౌంటర్‌ను ప్రభుత్వ విప్, వేములువాడ ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్, బోయినపల్లి మండల కేంద్రంతోపాటు కోరెం, బూరుగుపల్లి గ్రామాల్లోని కౌంటర్లను ఎమ్యెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట, అక్కపల్లిలో అడిషనల్ కలెక్టర్ ఎన్ ఖీమ్యానాయక్, ముస్తాబాద్ మండలం బందనకల్, తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్, సిరిసిల్లలోని నాలుగో వార్డులో లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమి ప్రారంభించారు.
ధర్మారం మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి మండలం హనుమంతుని పేట, సుల్తానాబాద్ మండలం మియాపూర్, చిన్న బొంకూర్ గ్రామాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, గోదావరిఖని 29వ డివిజన్ బాపూజీ నగర్ లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజా పాలన కౌంటర్లను ప్రారంభించారు. కోరుట్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో మొత్తం 5,059 అప్లికేషన్లు అందాయని మున్సిపల్ కమిషనర్రాజేశ్వర్ తెలిపారు. మెట్ పల్లిలోని 4వ వార్డులో ప్రజాపాలన అప్లికేషన్లు ఫిల్చేసేందుకు అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్సదానందం హెల్ప్‌చేశారు.